అతివేగం బలితీసింది
ట్రాక్టర్ బోల్తా పడి ఇటుకల కార్మికుడు దుర్మరణం…
లోకేశ్వరం-సాత్‌గాం రహదారిపై ఘోర ప్రమాదం
ట్రాలీ కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి
డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసిన లోకేశ్వరం ఎస్సై
లోకేశ్వరం,ఆగస్టు 6 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త ఓ నిరుపేద ఉపాధి కార్మికుడి ప్రాణాలను బలిగొంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో, ట్రాలీ కిందపడి ఒక యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.ఈ విషాద సంఘటన లోకేశ్వరం మండల కేంద్రం సమీపంలో గురువారం చోటుచేసుకుంది.లోకేశ్వరం ఎస్సై ఎల్. ప్రదీప్,బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా,భోకర్ పట్టణానికి చెందిన నితిన్ వెంకటి అప్పుల్‌వాడ్ (29),రవి నాగనాథ్ బోయిన్‌వాడ్ (25) అనే ఇద్దరు యువకులు ఉపాధి నిమిత్తం లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామానికి వచ్చారు. అక్కడ ఎం.ఏ. కలీంకు చెందిన ఇటుక బట్టీలో గత నాలుగు నెలలుగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.గురువారం మధ్యాహ్నం సుమారు 12:00 గంటల సమయంలో, డ్రైవర్ రవి నాగనాథ్ ఇటుకల లోడుతో కూడిన ట్రాక్టర్ (TS 18 T 0063)తో బయలుదేరాడు. నితిన్ అప్పుల్‌వాడ్ ఇటుకల లోడు ఉన్న ట్రాలీపై కూర్చున్నాడు.మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో లోకేశ్వరం – సాత్‌గాం రహదారిపై వెంగల్‌రావు పొలం సమీపానికి చేరుకోగానే, డ్రైవర్ రవి నాగనాథ్ ట్రాక్టర్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాలీపై ఉన్న నితిన్ కిందపడిపోగా, ఇటుకలతో ఉన్న ట్రాలీ నేరుగా అతనిపై పడింది. దీంతో తల,ముఖ భాగాలు తీవ్రంగా నుజ్జునుజ్జయి నితిన్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న మృతుడి సోదరుడు ప్రహ్లాద్ అప్పుల్‌వాడ్ మరియు బంధువులు భైంసా ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. శవాగారంలో తీవ్ర గాయాలతో ఉన్న నితిన్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.మృతుడి అన్న ప్రహ్లాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ రవి నాగనాథ్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పేర్కొంటూ క్రైమ్ నంబర్ 97/2026, BNS సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు…