కరీంనగర్ సమగ్ర అభివృద్ధే లక్ష్యం
రాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశంలో మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ అక్షిత బ్యూరో
ఆధునిక, ప్రణాళికాబద్ధమైన, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కలిగిన ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ హైదరాబాద్‌లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయాల్లో రాష్ట్ర ఉన్నతాధికారులతో వరుసగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్ ” డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ టి.కె. శ్రీదేవి తో పాటు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇంజినీర్-ఇన్-చీఫ్ తదితర ఉన్నతాధికారులను కలిసి కరీంనగర్ నగర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మేయర్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రత్యేక నిధులు, పరిపాలనా అనుమతులు, సాంకేతిక సహకారం అందించాలని కోరారు. సమావేశంలో ముఖ్యంగా నగరంలోని ఆర్ అండ్ బీ రోడ్లకు అత్యవసర ప్యాచ్‌వర్క్, పునరుద్ధరణ పనులు, తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయడం, అప్రోచ్ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం, విలీన గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైన్లు, వీధి దీపాలు, పారిశుధ్య వసతులు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ విస్తరణ, లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణ చర్యలు, స్మార్ట్ సిటీ మరియు యూఐడీఎఫ్ పనులను వేగవంతం చేయడం, ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ సుందరీకరణ వంటి అంశాలను ప్రస్తావించారు.అదేవిధంగా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించిన మేయర్, ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, అక్రమ నిర్మాణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, భవిష్యత్ నగర విస్తరణను దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని డీటీసీపీ అధికారులను కోరారు. ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ తదితర ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, అభివృద్ధి పనుల అమలు వేగవంతం చేసేందుకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని నియమించాలని ఈఎన్‌సీ దృష్టికి తీసుకెళ్లారు. విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అక్కడ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికలు, విద్యుత్ వీధి దీపాలు వంటి సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ చర్యలకు అవసరమైన అనుమతులు, నిధులు అందించాలని కూడా మేయర్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలో ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరిన మేయర్, నగర అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన ఆమోదాలు మంజూరు చేయాలని అధికారులను అభ్యర్థించారు.మేయర్ సమర్పించిన ప్రతిపాదనలను అధికారులు సానుకూలంగా స్వీకరించి, సంబంధిత శాఖల సమన్వయంతో ప్రాధాన్యతా పనులను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సమావేశాలు కరీంనగర్ నగర భవిష్యత్ అభివృద్ధికి కీలక మలుపుగా నిలుస్తాయని, ప్రజల ఆశలకు అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.