పరిశుభ్ర బోగారం లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం
– నాలుగు రకాల చెత్తబుట్టల వినియోగంపై ప్రజలకు అవగాహన
– ప్రతి ఇంటా చెత్త విభజనతో స్వచ్ఛ గ్రామ నిర్మాణానికి సర్పంచ్ కునూరు సాయి కుమార్ గౌడ్ పిలుపు
రామన్నపేట, అక్షిత ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో స్వచ్ఛ గ్రామ నిర్మాణమే లక్ష్యంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నాలుగు రకాల చెత్తబుట్టల వినియోగం, చెత్త విభజనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ “మన గ్రామం–మన బాధ్యత” అనే భావనతో ప్రతి కుటుంబం చెత్తను తడి, పొడి తదితర వ్యర్థాలుగా వేరు చేసి, వాటిని ఆయా చెత్తబుట్టల్లోనే వేయాలని సూచించారు. చెత్తను మూలస్థాయిలోనే శాస్త్రీయంగా విభజించడం ద్వారా గ్రామంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచవచ్చని తెలిపారు.పరిశుభ్రమైన పరిసరాలతో దోమలు, ఈగల వ్యాప్తిని నియంత్రించడంతో పాటు అంటువ్యాధుల నివారణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పరిశుభ్రమైన గ్రామమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని, బోగారం గ్రామాన్ని ఆదర్శ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యులు నేరటి మానస సురేష్ యాదవ్, మేడి ఆంజనేయులు, కనుక మల్లేష్, చిరగోని శిల్పా, నవీన్ యాదవ్, వనం అండాలు, యాదగిరి, గ్రామపంచాయతీ కార్యదర్శి ఏ. సుధా, సంఘబంధం అధ్యక్షురాలు పబ్బు జ్యోతి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గాదే హేమలత, భోగ సంధ్యతో పాటు గ్రామ పెద్దలు కూనూరు మహేష్ గౌడ్, బైకాని మహేష్ యాదవ్, మేడి కృష్ణ, మేడి ముఖేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
