నల్గొండ, అక్షిత ప్రతినిధి : విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం హైద్రాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లు, ఎస్.పి.లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భారీ వర్షాల కారణంగా జిల్లాల్లో పరిస్థితులను సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడతూ గత 24 గంటలలో జిల్లాలో 14.9 మి. మి వర్ష పాతం కురిసిందని, జిల్లాలో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు, లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు వర్షాల కారణంగా నల్గొండ పట్టణంలో రెండు రోజుల క్రితం గోడ కూలి ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు,14 గృహాలు పాక్షికంగా, రెండు గృహాలు పూర్తిగా దెబ్బ తిన్నట్లు,3 అవులు, 8గొర్రెలు, ఒక గేదె మృతి చెందినట్లు తెలిపారు .జిల్లా కలెక్టరేట్ లో వర్షాల పై కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్.పి. రెమా రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగం రెవెన్యూ, ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుసున్న వర్షాల కారణంగా ఆస్తి,ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు .లోతట్టు ప్రాంతాలు గుర్తించి జలమయం కాకుండా ముందు జాగ్రత్తగా అక్కడి ప్రజలను వేరే చోటుకు తరలించాలని, అవసరమైతే సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని,విద్యుత్ స్తంభాలు పడిపోతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైతే వర్షం నీరు అధికంగా ప్రవహించే రహదారులు, కాజ్ వే లలో ప్రజలు ఇబ్బంది పడకుండా బారి కేడింగ్ ఏర్పాటు చేసి రక్షణ ఏర్పాట్లు చేయాలని అన్నారు .ఈ వి.సి.లో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,డి.అర్. ఓ.జగదీశ్వర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ కె.వి. రమణా చారి,సి.పి. ఓ.బాల శౌరి,జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,డి.పి. ఓ.విష్ణు వర్ధన్ లు పాల్గొన్నారు.