గిరిజన ఉద్యోగాలకు గండి కొడుతున్న గడల

అధికార దుర్వినియోగం చేస్తున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ రాజీనామా చేయాలి

-నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం పొందిన వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోరా ?

-వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ నరాల సత్యనారాయణ

భద్రాద్రి/ అక్షిత బ్యూరో :

గిరిజనుల ఉద్యోగాలకు గండి కొడుతున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనీవాసరావు పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. వైద్యశాఖలో రాష్ట్ర అత్యున్నత పదవిలో ఉన్న గడల శ్రీనివాసరావు కేవలం రాజకీయ కాంక్షతోనే కొత్తగూడెం నియోజకవర్గంలో పట్టుకోసం అడిగిన వాళ్లందరికీ ఉద్యోగం ఇవ్వాలని సిఫారసు లేఖలు పంపడం అధికార దుర్వినియోగం లెక్కలోకి వస్తుందన్నారు.ఆసుపత్రిలో 12 వేల జీతం వచ్చే చిన్న స్వీపర్ ఉద్యోగం ఇవ్వాలన్న నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించి వాటిలో మెరిట్ ఉన్న వాటిని పరిగణలోకి తీసుకుని ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా అధికారులది. ఏజెన్సీలో గిరిజనులని కాదని గిరిజనేతరులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ హోదాలో సిఫార్సు లేఖలు పంపుతూ జిల్లాలో అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని గిరిజన హక్కులను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోన్న హెల్త్ డైరెక్టర్ తీరు సమంజసం కాదని నరాల సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. బంధుప్రీతీ తో తన మరదలు సామినేని దుర్గాభవాని కి రాజకీయ సమీకరణం కోసం ప్రజాప్రతినిధి కుమార్తె కంచర్ల లేఖశ్రీ లకు నిబంధనలకు విరుద్ధంగా కేవలం తన సిఫార్సు లేఖల ద్వారా ఉద్యోగం ఇవ్వడం కరెక్ట్ కాదు. గడల శ్రీనివాసరావు కేవలం తన రాజకీయ లబ్ది కోసమే ఏజెన్సీ పరిధిలో నిబంధనలు కాదని తనకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇస్తూ ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఎవరు ఎలాంటి వారో తెలుసని ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసే వారినే ఎన్నుకుంటారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ నరాల సత్యనారాయణ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking