ఆలోచన…ఆచరణల సమ్మిళితంతోనే సక్సెస్
నిర్దిష్ట రంగాలలో విజయం
దిశగా విభిన్న భాగస్వాములు
– ఊర్జిత్ ఆర్.పటేల్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
“పునఃక్రమబద్ధీకరణలోనూ: భావనాత్మక పరివర్తన” ఇది 15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎన్.కె.సింగ్ రచించిన కొత్త పుస్తకం. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా ‘ప్రత్యేక వ్యాఖ్యల’తో కూడిన ఈ పుస్తకం భారత జీవన గమనంలో సమీప అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి పురోగమనాన్ని, అసంపూర్ణ కార్యభారాలను మన ముందుంచుతుంది. ఇవన్నీ కొన్ని మైలురాళ్ల వంటి అంతర్జాతీయ ఒప్పందాలు… ‘విపత్తు ముప్పు తగ్గింపుపై సెండయ్ చట్రం’ (సెండాయ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్), ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్-ఎస్‌డిజి), పారిస్ ఒప్పందం (వాతావరణ మార్పుపై ఒడంబడిక)లలో సందర్భోచితంగా గుదిగుచ్చబడ్డాయి.
శ్రీ సింగ్, మిశ్రా.. ఇద్దరూ దాదాపు ఒక జీవితకాలం పాటు విభిన్న రంగాల్లో పాలనదక్షులుగా నిరూపించుకున్న వారే. ఆయా రంగాల్లో వారికిగల లోతైన అవగాహన, ప్రతిస్పందనాత్మక అనుభవం వారు వేర్వేరుగా రాసిన ప్రతి వ్యాసంలోనూ ప్రతిబింబిస్తాయి. కాబట్టి వాటిలో వెలిబుచ్చిన అభిప్రాయాలకు వారే బాధ్యులనడంలో సందిగ్ధమేమీ లేదు. ఆ మేరకు ఆలోచనలు-ఆచరణ చుట్టూ కట్టుదిట్టమైన స్వరూప నిర్మాణంతో కూడిన ఈ పుస్తకం కచ్చితంగా చదవదగినదే. అలాగే ఇదెంతో వివరణాత్మకంగా ఉండి, మస్తిష్కంలో ఆలోచనను రగిలిస్తుంది. మన జాతీయ శ్రేయస్సుకు గుండెకాయ అనదగిన పంటల బీమా, విపత్తు నిర్వహణ వంటి నిగూఢమనిపించే అంశాలపై నిపుణులు కానివారు కూడా చక్కగా అర్థం చేసుకోగలిగేలా అనవసర పదాడంబరానికి పోకుండా సరళమైన భాషలో వివరించబడ్డాయి.
ఇది ఆచరణాత్మక స్థానాల్లో గలవారు రాసిందిగనుక ఇందులో స్వీయానుభవాల ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. కానీ, ఇదేమీ పౌరాణిక గ్రంథం వంటిది కాదు… నిర్దిష్ట రంగాల్లో సుదీర్ఘ కాలం పనిచేయడం వల్ల సరళ రీతిలో ఆలోచనల వెల్లడి, సమతూకపు అంచనాలు, వ్యక్తిగత నిష్కాపట్యం తదితరాల ద్వారా వృత్తి నైపుణ్యం అబ్బుతుంది. అయితే, సానుకూల ఫలితం లభిస్తే ‘అది నా ఘనతే’ అనడం, బెడిసికొడితే ‘అది మరెవరో చేసింది’ అనే బుకాయింపు ఈ పుస్తకంలో కనిపించదు. ఏదైనా ఉందంటే- ప్రాథమికంగా పునరాలోచన అన్నది నిర్దిస్ట రంగాల్లో విజయం కోసం విభిన్న భాగస్వాములు ఒక్కతాటిపైకి ఎలా వచ్చారో వివరించేదిగానే ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాలతోపాటు మూడో అంచె మధ్య పరిపాలన, సాధికారత, సమన్వయంలో విపత్తు నిర్వహణకు సంబంధించి ఆధునీకరణ పరిణామ క్రమం సమగ్రంగా వివరించబడింది. ఇది ఎలాంటిదంటే శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, గణితం (అంచనాలు, ప్రతిరోధకత ప్రేరేపిత నిర్మాణ స్మతి, పునర్నిర్మాణం తదితరాల కోసం) వంటి వాటితో కూడిన ఒక వాస్తవిక బహుళరంగ ప్రమేయంగలది. అదే సమయంలో (ఆర్థిక సహాయం, జీవనోపాధి నెట్‌వర్కుల సత్వర పునర్నిర్మాణం కోసం) సామాజిక శాస్త్రాలు కూడా పాలనలో భాగమవుతాయి.
ఉదాహరణకు॥ ముందస్తు హెచ్చరికలు, స్వీయ-సహాయ చిట్కాల విషయంలో ప్రజా-కేంద్రక విధానం శాస్త్రవిజ్ఞానంతో సమాజాన్ని అనుసంధానిస్తుంది. అంతేగాక నిర్దేశించిన మేరకు ఉపకరణాలను స్పష్టంగా, ప్రభావవంతంగా, సమర్థంగా వినియోగించడంలో ప్రత్యేక చట్టం ప్రాతిపదికగా సూక్ష్మీకరించిన బహుళ అంచెల కార్యాచరణ నిర్వహణ విధానం తోడ్పడుతుంది. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలను దూరదృష్టితో నిర్వహించగల ప్రభుత్వాల సామర్థ్యంపై మొత్తంమీద ప్రజల్లో విశ్వాసం పెరిగింది.
మెరుగైన మౌలిక వసతుల కల్పన
కచ్ ప్రాంతంలో 2001 జనవరి నాటి భూకంపం… ఆ తర్వాత గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఏర్పాటు ఒక వినూత్న పరివర్తనకు బాటవేసింది. ఎలాగంటే- యజమానుల ద్వారా గృహాల పునర్నిర్మాణం, పాఠశాలలు వంటి ప్రజా ఆస్తుల పునర్నిర్మాణంలో సామాజిక ప్రమేయం, నిర్ణయాల్లో పారదర్శకత, ఫలితాల సమాన పంపిణీ వంటివి అందులో భాగంగా ఉన్నాయి. రాబోయే కాలంలో మన దేశం (ప్రపంచం కూడా) బహుముఖ ముప్పులను ఎదుర్కొనే ప్రమాదం ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19, భవిష్యత్ విపత్తు ముప్పుల నిర్వహణకు సంబంధించిన అధ్యాయం ఆకస్మిక ముప్పులపై గతిశీల అంచనాకు తగిన ఉపకరణాల గురించి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుంది. ఆ మేరకు ప్రస్తుత పరిమితులను రచయిత నిర్మొహమాటంగా అంగీకరిస్తూ ఈ దిశగా మరింత కృషి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.
ఇక ఆర్థిక సమస్యలకు సంబంధించిన అధ్యాయాలలో విస్తృత పరస్పర అనుసంధాన చర్చ ఏం చెబుతుందంటే- గడచిన మూడు దశాబ్దాలుగా దీనిపై శ్రద్ధ అరకొరగానే ఉందని, సుస్థిర ప్రగతి (ఎస్‌డిజి-వాతావరణ సంబంధిత) లక్ష్యాల సాధన కోసం వీటిని సహేతుక వ్యవధిలోగా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేస్తుంది.
ఈ కీలక అంశంపై భవిష్యత్ నిర్దేశాన్ని రచయిత రెండు శీర్షకల కింద విభజించి వివరించారు.
► ఆర్థిక బాధ్యత-బడ్జెట్ నిర్వహణ చట్టం-2003 (ఎఫ్‌ఆర్‌బీఎం) నిర్దేశించిన అధికారిక హామీలను నెరవేర్చడం, 2017నాటి ‘ఎఫ్‌ఆర్‌బీఎం’ సమీక్ష కమిటీ నివేదికలోని సిఫారసును పాటించడం, సంస్థాగత సర్దుబాట్లు చేసుకోవడం అవశ్యం.
► అలాగే పరిమాణాత్మకంగా చూసినపుడు స్థూల ఆర్థిక స్థిరత్వం కోసం ‘ఆర్థిక సంయమనం నుంచి ఆర్థిక నైతికత’ వైపు విశ్వసనీయ మార్గం ఏర్పరచుకోవడమే తక్షణ సవాలు. ఒక్కమాటలో చెబితే- విపరీత వ్యయంతో ఆర్థిక వృద్ధిని అందుకోవడం అసాధ్యం.
ఈ 75వ స్వాతంత్ర్య సంవత్సరంలో మహాత్మాగాంధీ మాటను మననం చేసుకుందాం- “ఒక వ్యక్తి లేదా దేశం నైతిక శ్రేయస్సును దెబ్బతీసే ఆర్థికశాస్త్రం అనైతికమైనది కాబట్టి కచ్చితంగా పాపిష్దిదే అవుతుంది” అని ఆయన ఈ నేపథ్యంలో రచయిత- ‘నిలకడలేని రుణాలు, ప్రభుత్వం మీద అధిక రుణభారం తోడ్పాటుతో పెరిగే వ్యయం దేశ నైతిక శ్రేయస్సును దెబ్బతీస్తుంది” అని స్పష్టం చేస్తున్నారు. అంటే- ఈ వృద్ధి నాణానికి అప్పులు దూసి తెచ్చిన డబ్బు, ద్రవ్యోల్బణం రెండోవైపున ఉంటాయన్నది సుస్పష్టం. ఇక్కడ రచయిత సిద్ధాంతం ఆధారంగా కాకుండా ఆచరణాత్మక స్థూల ఆర్థికవేత్తగా చెబుతున్న హితవును మనం స్వీకరించి తీరాలి.
భారత ఆర్థిక సమాఖ్య కార్యాచరణ నిమిత్తం ఆర్థిక బాధ్యత చట్టాలకు అదనంగా రెండు రాజ్యాంగ వ్యవస్థలు: ఫైనాన్స్ కమిషన్, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మండలి ఉన్నాయి. ఇందులో రెండో వ్యవస్థ నిబందనల ప్రాతిపదికన జీఎస్టీ శాతాలను నిర్ణయిస్తుంది. అయితే, మొదటి వ్యవస్థ ఐదేళ్లకు ఒకసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య; అలాగే రాష్ట్రాలు, మూడో అంచెలోని పాలక మండళ్ల మధ్య రాబడి పంపిణీపై సిఫారసులు చేస్తుంది. ఈ నేపథ్యంలో మరింత ప్రభావవంతమైన ఆర్థిక సమాఖ్య తత్వం పరిఢవిల్లాలంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒక సమన్వయ యంత్రాంగం తక్షణావసరమనే తన వాదనను రచయిత సహేతుకంగా వివరించి మనను ఒప్పిస్తారు.
ముందడుగు కోసం వెనుదిరిగి చూసుకోవడం
ఈ పుస్తకంలో ఆర్థిక సంఘంపై అధ్యాయం సంబంధి పాఠ్యాంశం అభ్యసించే విద్యార్థులకు వరంలాంటిది. ఇది 1919 భారత ప్రభుత్వ చట్టం తర్వాత ఏర్పాటైన నాటినుంచి 1951 దాకా నియమించబడిన అన్ని ఆర్థిక సంఘాల ప్రధాన సిఫారసుల సారాంశాన్ని అత్యంత పొందికగా వివరిస్తూ సదరు పరిణామ క్రమంపై సుస్పష్ట చారిత్రక వివరణను మన ముందుంచుతుంది. కాగా, గత రెండు ఆర్థిక సంఘాలు అటవీ విస్తరణకు నిర్దిష్ట ప్రాధాన్యం ఇవ్వడం ఈ సందర్భంగా గమనార్హం. వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం కేవలం మాటలతో సరిపెట్టకుండా రాబడి పంపిణీకి అత్యంత ప్రాధాన్యమిచ్చాయి.
మనం… ముఖ్యంగా సామాజిక రంగంలో మోయలేనంత చట్టాల భారంతో ఎందుకు కునారిల్లుతున్నామో చర్చిస్తూ రచయితలిద్దరూ సంయుక్తంగా మరొక అధ్యాయం రాసి ఉంటే ఎంతో సహాయకారిగా ఉండేది. ఏదిఏమైనా పాలనలో పునఃక్రమబద్ధీకరణ పరంగా ఈ జాతీయ చట్ట పక్షపాతం గురించి తప్పక యోచించాలి.
రచయిత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్