బంధన్ తో… ఆత్మీయ అనుబంధం

*ప్రగతి భవన్ లో ఘనంగా

రక్షా బంధన్ వేడుకలు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రక్షా బంధన్ వేడుకలు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్ లో శుక్రవారం ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా ప్రేమ ఆప్యాయతలు, సహోదర భావాలు వెల్లివిరిసాయి. సోదరీమణుల రాకతో సీఎం  నివాసం లో సందడి నెలకొంది. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సీఎం కేసీఆర్  సతీమణి శోభమ్మ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి వారి అక్కలు, లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తమ సోదరున్ని నిండు మనసుతో ఆశీర్వదించారు. అదే సందర్భంలో… సీఎం కేసీఆర్ మనుమడు, మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా తమ మనుమడు మనుమరాలును నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు. వేడుకల్లో పాల్గొన్న పెద్దలు కూడా చిన్నారులను దీవించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.అంతకు ముందు ఉదయం ప్రగతి భవన్ లో, తన అన్న కేటీఆర్ ( మినిస్టర్)కు చెల్లె కవిత (ఎమ్మెల్సీ) రాఖీ కట్టి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. కేటీఆర్  చెల్లెలు సౌమ్య (చిన్నమ్మ కూతురు,ఎంపీ సంతోష్ కుమార్ సోదరి) రాఖీ కట్టి, వేడుకల్లో పాల్గొన్నారు.

ప్రగతి భవన్ కార్యాలయ మహిళ సిబ్బంది రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking