టోపీతో వచ్చి…
ప్రజలకు కుచ్చు టోపీ
సీఎం రాకతో
ఒరిగిందేమీ లేదు
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, అక్షిత ప్రతినిధి :
ముఖ్యమంత్రి రాకతో వికారాబాద్ జిల్లాకు ఎలాంటి లాభం చేకూరలేదని కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే కోట్లాది రూపాయల నిధులు వస్తాయని జిల్లా ప్రజలతో పాటు తాము కూడా ఎంతో ఆశతో ఎదురు చూశామని, జిల్లా ప్రజల ఆశలను ముఖ్యమంత్రి నిరాశ పర్చారని ఆయన పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాను ముఖ్యమంత్రి కెసిఆర్ ఇయ్యలేదని ఈ ప్రాంత వాసులం కొట్లాడి సాధించుకున్నామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేయించామని, ఆ ఫైల్ సీఎమ్ఓ లో ఉందని దానిని తీసుకురావడానికి ఈ ఎమ్మెల్యేకు ఇన్ని రోజులు పట్టిందని అన్నారు.నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాన్ని గిరిజనుల భూములు తీసుకొని నిర్మించారాని, భూములు కోల్పోయిన వారికి గతంలో భూములు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు,పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధమని, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రిడిజైన్ పేరుతో తీసుకెళ్లి ఈ ప్రాంతా ప్రజలను మోసం చేసింది నువ్వు కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కిషన్ నాయక్, రత్నారెడ్డి, జాఫర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.