నాడు పిడికెడు మందితో ఆరంభం
నేడు లక్షలాది మందితో మహా వృక్షంలా
కార్యకర్తలే పార్టీకి నిజమైన బలం
గడపగడపకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు
ఆపదల్లో కార్యకర్తలకు అండ
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర సమితి( టీఆర్ఎస్) పార్టీ పిడికెడు మందితో ప్రారంభమై చరిత్ర తిరగరాస్తున్నదని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. పార్టీ కార్యకర్తలే టీఆర్ఎస్ కు నిబమైన బలమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 18వ వార్డు- హనుమాన్ నగర్ కు చెందిన 200 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు.. రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. నిబద్ధత ఉన్న కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినప్పుడు అనేక మంది ఉద్యమకారులు టీఆర్ఎస్ కు అండగా నిలిచారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చిన్న మొక్కలా ప్రారంభమైన గులాబీ పార్టీ మహా వృక్షంలా మారిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదవశాత్తూ మృతిచెందినట్టయితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేసి గులాబీ పార్టీ బాసటగా నిలుస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్నారని అన్నారు. అందుకే, యువత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలెవరికైనా ఏ ఆపద వచ్చినా ఆదుకుంటున్నారని అన్నారు. 2001, ఏప్రిల్27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ గడిచిన 20 ఏండ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కార్యకర్తలను ఆదుకునే స్థాయికి ఎదిగిందని అన్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోందని అన్నారు. 32 జిల్లా పరిషత్ కార్యాలయాలపై గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయని అన్నారు. 130 మున్సిపాలిటీల్లో 122 కైవసం చేసుకున్నామని, 12,751 గ్రామ పంచాయతీల్లో 9500 స్థానాల్లో గెలుపొందామని అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ పని చేస్తున్నదన్నారు. త్యాగాల పునాధులపై ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, దళిత బంధు, ఆసరా పెన్షన్, ఓవర్సెస్ స్కాలర్షిప్ వంటి పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు. అంతేగాకుండా, గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్నదని చైతన్యపర్చాలని కోరారు. ప్రతీ గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలని కోరారు. పేదింటి అడబిడ్డల పెండ్లి కోసం కల్యాలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మౌళికవసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆత్మ గౌరవం కోసం ఉద్భవించిన పార్టీ అని అన్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలను సామాజిక మాధ్యమాల్లో గట్టిగా బదులిస్తున్న టీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులను భాస్కర్ రావు అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, సింగల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.