
ఐలమ్మ సేవలు…చిరస్మరణీయం
నలమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయమని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ పేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, రజక సంఘం సభ్యులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. తెలంగాణ ప్రజల విముక్తి కోసం భూస్వాములకు, పెత్తందారులకు,రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వీరనారి ఐలమ్మ సేవలు మరువలేనివని అన్నారు.

ఐలమ్మ స్పూర్తితో ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం పోరాడిన వీరనారి, ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని చెప్పారు.సామాజిక ఆధునిక పరిణామానికి ఆమె నాంది పలికారని అన్నారు. చాకలి కులవృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగించారని అన్నారు.విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకార్ల అరాచకాలపై ఎదురుతిరిగిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ‘ఈ భూమి నాది..పండించిన పంట నాది…తీసుకెళ్లడానికి దొరెవ్వడు…నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమిని మీరు దక్కించుకోగలరు’ అని మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని అన్నారు. మొక్కవోని సంకల్పంతో రోకలి బండ చేతబూని తనపై దాడికి ప్రయత్నించిన దుండగులను తరిమికొట్టిన ధైర్యశాలి ఐలమ్మ అన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని సిద్దార్ధ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బాసాని అలివేలు గిరి, పట్టణ రజక సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి దుర్గయ్య, పట్టణ రజక సంఘం ప్రధాన కార్యదర్శి కుమ్మరికుంట్ల సుధాకర్, పట్టణ టీఆర్ఎస్ అధికార ప్రతినిధి పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, బీసీ సంఘం నాయకులు మారం శ్రీనివాస్, జాజుల లింగం గౌడ్, నల్లగంతుల నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.