బిజేపి, కాంగ్రెస్… దొందు దొందే

బీజేపీ, కాంగ్రెస్‌ దొందు దొందే : హరీశ్‌రావు

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు దొందు దొందే అనే విషయం ఈ చర్చల ద్వారా ప్రజలకు అర్థమైందని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘త్యాగాలు, పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నాం. మిలియన్‌ మార్చ్‌లో పాల్గొనకుండా అరెస్టులు చేస్తే.. తప్పించుకొని పోయి బోటు ద్వారా ట్యాంక్‌బండ్‌కెక్కి విజయవంతం చేశాం. సాగరహారంలోనైనా ఎవరు ఉన్నరు? ఎవరు పని చేశారు? ఇవాళ మాట్లాడుతున్న పార్టీలు ఆ రోజు ఎక్కడున్నయో ప్రజలు మరిచిపోలేదని ఈ సభ ద్వారా గుర్తు చేస్తున్నారు. సకల జనుల సమ్మె జరిగి ఇవాళ్టికి 11వ సంవత్సరాలు.

సెప్టెంబర్‌ 13, 20211 రోజున సకల జనుల సమ్మెకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇవన్నీ ప్రజలకు గుర్తున్నయ్‌. ఆ రోజు సకల జనుల సమ్మెలో పాల్గొన్నరో ప్రజలకు గుర్తన్నది. తెలంగాణ తెచ్చింది కేసీఆర్‌. కేసీఆర్‌ పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దాన్ని ఎవరూ కాదనలేదు. రాష్ట్రం ఏర్పడ్డా.. ప్రభుత్వం ఏర్పడకు ముందే ఏ రకంగా, లోయర్‌ సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నరో నిన్న అసెంబ్లీలోనే సీఎం చెప్పారు. ఇవాళ ఏడు మండలాల ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నరు. మమ్మల్ని తెలంగాణలో కలపాలని అనేక సందర్భాల్లో ధర్నాలు, దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడనున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. బీజేపీతో పొత్తులో ఉంటే మరి.. తమ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల గొంతు కోసేలా.. ఏడు మండలాలు, లోయర్‌ సీలేరును ఆంధ్రాలో కలిపారు’ అన్నారు.

లోయర్‌ సీలేరు కోల్పోవడంతో ఏటా వెయ్యికోట్ల నష్టం..
‘లోయర్‌ సీలేరు ప్రాజెక్టును కోల్పోవడం వల్ల.. సంవత్సరానికి రూ.వెయ్యికోట్లు తెలంగాణ కోల్పోతున్నది. హైడల్‌ ప్రాజెక్టుల్లో కెల్లా అత్యుత్తమమైన ప్రాజెక్టు లోయర్‌ సీలేరు. సంవత్సరానికి మూడు వందల రోజులు హైడల్‌ పవర్‌ ఉత్పత్తి అవుతుంది. 10, 20 పైసలు యూనిట్‌ కరెంటు తయారవుతుంది. ఇవాళ ఓపెన్‌ మార్కెట్‌లో 12 రూపాయలకు కరెంటును కొంటున్నం. కేంద్ర ప్రభుత్వం యొక్క తెలంగాణ వ్యతిరేక, నిరంకుశ వైఖరి తెలంగాణ.. ఏటా వెయ్యి కోట్లు కోల్పోతున్నది. ఏడు మండలాలను కోల్పోయాం. ప్రధానమంత్రి తల్లిని చంపి.. బిడ్డను బతికించారని పార్లమెంట్‌లో, బయట బహిరంగ సభల్లో పదేపదే మాట్లాడడం తెలంగాణ ప్రజలను తీవ్రంగా అవమానించడం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవమానపరచడం. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రధానే కాదు.. అనేక మంది కేంద్రమంత్రులు పదేపదే మాట్లాడుతున్నరు. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఏం జరిగిందో తెలుసు. తప్పుడు ప్రక్రియ జరిగిందని, తొందరపాటులో జరిగిందనే అర్థంవచ్చేలా స్వయంగా ప్రధాని, కేంద్రమంత్రులు మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రయను తప్పుబట్టడం.. తెలంగాణ, ఉద్యమకారులను అవమానించడమే. కాంగ్రెస్‌ తప్పిదాలను బీజేపీ చెప్పే ప్రయత్నం చేసింది. బీజేపీ తప్పిదాలను కాంగ్రెస్‌ పార్టీ ఎత్తిచూపే ప్రయత్నం చేసింది. మొత్తం రెండు పార్టీలు దొందు దొందే అనే విషయం ఈ చర్చ ద్వారా తెలంగాణ ప్రజలకు అర్థమైంది’ అన్నారు.

ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలే..?
‘ఆ నాడు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆ నాడు చట్టంలో పెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అంబేద్కర్‌ ప్రాణహిత – చేవేళ్లకు జాతీయ హోదా పెట్టి ఉంటే.. జాతీయ ప్రాజెక్టు వచ్చి ఉండేది. ఆ చట్టంలో పెట్టకపోతే మీకు జాతీయ హోదా ఇచ్చేందుకు మీకేమైనా అడ్డం ఉందా? అని బీజేపీని అడుగుతున్న. ఇస్తా అంటే ఎవరైనా వద్దన్నరా? కర్నాటకలోని అప్పర్‌ భద్ర ప్రాజెక్టు, ఉత్తరాఖండ్‌లోని బుందేల్‌ఖండ్‌ గెన్‌బెత్వ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తరు? మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది అని బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నా. నీళ్ల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైంది కృష్ణా నదీజలాల పంపకం. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం చాలా దారుణంగా తెలంగాణ ప్రజలకు నష్టం, తీవ్రమైన జాప్యం చేస్తున్నది.

సీఎం కేసీఆర్‌ తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డది జూన్‌ 2, 2014 ప్రభుత్వం ఏర్పడ్డది. 14 జూలై, 2014న కృష్ణా నదీజలాల్లో మా వాటా తేల్చాలని కేంద్రం వద్ద తెలంగాణ రాష్ట్రంగా పిటిషన్‌ పెట్టాం. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం సెక్షన్‌ 3 ప్రకారం.. ఏదైనా రాష్ట్రం నదీ జలాల్లో అన్యాయం జరిగిందంటే.. సంవత్సరంలోగా సమస్య పరిష్కరించాలి? లేదంటే ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి. అప్పటి కేంద్రమంత్రి ఉమా భారతి వద్దకు వెళ్లి కృష్ణా నదీజలాల్లో మా పరీవాహక ప్రాంతం ఎక్కువ.. మా వాటా మాకు కావాలని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా అక్కడికి వెళ్లి చెప్పారు. దురదృష్టమేంటంటే.. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్ణయం తీసుకోవడం లేదు. లేఖలు రాసిన కేంద్రం పట్టించుకోకపోతే.. 10 ఆగస్టు 2015న సుప్రీంకోర్టులో కేసు వేశాం. కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదు.. ట్రిబ్యునల్‌ ఇవ్వడం లేదని కేసు వేశాం. సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్‌ వేయకుండా.. నిర్ణయం చెప్పకుండా పదేపదే వాయిదాలు అడుగూ తాత్సారం చేసింది’ అన్నారు.

కృష్ణా నదీ జలాల్లో వాటా ఇంకా తేల్చలే..
‘ఈ మధ్యకాలంలో షెకావత్‌ కేంద్రమంత్రిగా వచ్చిన సమయంలో అపెక్స్‌కమిటీ సమావేశం కోసం వెళ్లిన సమయంలో.. సీఎం కేసీఆర్‌ ఆయనకు అన్యాయమైంది? సుప్రీంకోర్టులో కేసు వేశాం? కౌంటర్లు వేయడం లేదని అడిగితే.. కేసు విత్‌డ్రా చేసుకొని మళ్లీ ముందు పిటిషన్‌ వేయండి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటా అన్నరు. బాధ్యతయుతమైన కేంద్రమంత్రి మాటలు విని పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఆ తర్వాత కేంద్రమంత్రి వద్ద సెక్షన్‌-3 కింద కృష్ణా నదీజలాల్లో మా వాటా తేల్చండి అని పిటిషన్‌ వేశాం. 7-10-2021న పిటిషన్‌ వేస్తే.. ఇవాళ్టికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 4-2-2022, 7-4-22, 6-6-22, 19-7-22న లేఖలు రాశాం.. సీఎం స్వయంగా వెళ్లి కలిసి గుర్తు చేశారు.

ఇప్పటికీ కృష్ణా నదీ జలాల్లో ఇంకా తెలంగాణ వాటా తేల్చడం లేదు. ఇంత దుర్మార్గమా? సంవత్సరంలో వివాదం పరిష్కరించాలని, లేకపోతే ట్రిబ్యునల్‌ వేయాలని చట్టం చెబుతోంది. తేల్చరు? ట్రిబ్యునల్‌ వేయరు? కోర్టుకు వెళితే పిటిషన్‌ విత్‌డ్రా చేయమంటరు.. నమ్మి విత్‌డ్రా చేసి పిటిషన్‌ వేస్తే 11 నెలలనైనా నిర్ణయం తీసుకోకపోవడం తెలంగాణపై వివక్షం కాదా? ప్రజలను చిన్నచూపు చూడడం కాదా? రోజుకో కేంద్రమంత్రి నోటికి వచ్చినట్లు మాట్లడుతున్నరు. దీనిపై తేల్చి మాట్లాండి. బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం పూటకు పూటకు మాట్లాడడం కాదు. దీని విషయం న్యాయబద్ధంగా వాటా తేల్చడం లేదు. కనీసం ఎంత లేదన్నా 550 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంటుంది’ అన్నారు.

గోదావరి – కావేరి అనుసంధానం పెద్ద జోక్‌
‘గోదావరిపై సర్‌ప్లెస్‌ వాటర్‌ ఉన్నది. వాటికి కూడా కేటాయింపులు ఇస్త లేరు. వాటికి క్లియరెన్స్‌ ఇస్తలేరు. గోదావరిలో నీరు ఎక్కువున్నయ్‌ కావేరికి కలుపుతం.. కర్నాకట, తమిళనాడుకు తీసుకుపోతం అంటరు.. నీళ్లు ఎక్కువ ఉంటే.. బేసిన్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వాలి కదా? ఇవి పెండింగ్‌లో పెడుతరు. బడ్జెట్‌ సమావేశంలో గోదావరి – కావేరీ అనుసంధానం చేస్తామని చెప్పడం పెద్ద జోక్‌. నీళ్లు ఎక్కువ ఉంటే.. బేసిన్‌లో ఉండే ప్రజల అవసరాలను తీర్చిన తర్వాత పక్క రాష్ట్రాలకు తీసుకుపోవాలి. తెలంగాణ ప్రాజెక్టులకు ఇవ్వరటా.. గోదావరిని తీసుకుపోయి కావేరికి కలుపతరట? ఇదెక్కడి న్యాయం. తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సమస్యలు పరిష్కరించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ సర్కారు సుప్రీంకోర్టుకు పోతే.. కోర్టు స్పష్టంగా చెప్పింది. హెడ్‌క్వార్టర్స్‌ ఎక్కడ ఉంటే.. అక్కడే ఉంటది.. దాన్ని బేస్‌ చేసుకొని విజభజన చేయమని సూచించింది. సుప్రీం కోర్టు తీర్పును తెలంగాణ ఆమోదించింది.. కేంద్రం హోంశాఖ కూడా.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే చేయాలని చెప్పినా.. ఇప్పటి వరకు చేయలేదు’ అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు.
రాష్ట్రానికి ఏం ఇవ్వకుండా కక్ష సాధింపులు…
రాష్ట్రానికి ఏం ఇవ్వకుండా కేంద్రం కక్ష సాధిస్తోంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, నవోదయ విద్యాలయం ఒక్కటీ ఇవ్వలేదు. ఐటీఐఆర్‌ను కేంద్రం ఎందుకు రద్దు చేసింది? పారిశ్రామిక కారిడార్‌లో కేంద్రం మొండి చేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం కృషితో 20వేలకోట్ల కొత్త ఐటీ పరిశ్రమలు వచ్చాయ్‌. కేంద్రం తెచ్చిన అమృత్‌ సరోవర్‌కు మన మిషన్‌ కాకతీయ ప్రేరణ. మన మిషన్‌ భగీరథ కేంద్రం తెచ్చిన హర్‌ ఘర్‌ కో జల్‌కు స్ఫూర్తి. మన రైతుబంధు.. పీఎం కిసాన్‌ యోజనకు ప్రేరణ. వైద్య కళాశాల ఇవ్వాలని అనేకసార్లు లేఖలు రాశాం. ఒక్క పైసా ఇవ్వకున్నా అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాం. రాష్ట్రం కోరుతున్న ప్రతి అంశాన్ని పెండింగ్‌లో పెడుతున్నరు’ అంటూ హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking