ఉద్యమం మిగిలే ఉంది. పోరాటం రగులుతూనే ఉంది
-ఉద్యమ కారుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్
-పోరాట స్ఫూర్తితో ముందుకు తెలంగాణ బచావో ఉద్యమం
-తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షులు బత్తుల సోమయ్య
(ప్రత్యేక వ్యాసం)
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడిన ఉద్యమకారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ బతుకు దెరువు కోసం బతుకులను ఫణంగా పెట్టి పోరాడారో ఆ బతుకుల్లో చీకట్లు తప్ప వెలుగులు లేవు. వస్తాయన్న ఆశలేదు. ఆచార్య జయశంకర్ చెప్పనట్లు రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడన్న మాటలను కేసీఆర్ నిరూపించి 2చూపిస్తున్నాడు. తెలంగాణను దాని అస్థిత్వాన్ని కించపరిచిన ఆంధ్రా గుత్త పెత్తందారి శక్తుల గుప్పిట్లో తెలంగాణను పెట్టి కమిషన్‌లకు కక్కుర్తి పడి రాష్ర్టాన్ని తాకట్టు పెట్టి దుస్థితి కనిపిస్తుంది. తన కుటుంబానికి మాత్రమే నిధులు నియామకాలు తన ఫామ్ హౌజ్‌కు మాత్రమే నీళ్లు అన్న చందంగా వ్యవహరిస్తున్న తీరు శోచనీయం. పెట్రోల్ మంటల్లో మాడిపోయిన బతుకులు, ఉరికొయ్యలను ముద్దాడిన త్యాగం, రైలు పట్టాల పై రగిలిన క్రోదం నడి రోడ్డు పై నిలబడి తలబడ్డ శౌర్యం. ఇవన్నీ కేసీఆర్ గారడి మాటల ముందు చిన్న బోయాయి. తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తన ఇంటి సొత్తుగా అనుభవిస్తుంటే ఉద్యమకారులంతా తెల్లబోయి చూడాల్సి వస్తుంది. ఈ తెలంగాణ కోసమే కదా ప్రాణాలను లెక్కచేయకుండా మన బిడ్డలు తెగించి కొట్లాడింది. మన బిడ్డలు మన్నులో ఉంటే తన బిడ్డలు మిన్నులో ఉండాలని కోరుకునే కేసీఆర్ అహంకారానికి చరమగీతం పాడాల్సిన సందర్భం ఇది. తన కూతురుని ప్రజలు తిరస్కరించినా రాజ్యసభ సీటు ఇచ్చి మరీ ఓదార్చిన కేసీఆర్ కడుపు తీపికి మా బిడ్డలు మాడి మసై పోయిన కడుపు మంట కనిపించడంలేదా.. ఉద్యమ కారుల ఊసెత్తితేనే కేసీఆర్ ఉలిక్కి పడుతున్నాడు. ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన సాహిత్యపు నినాదం అయిన కళాకారులను తాత్కాలిక ఉద్యోగాల పేరుతో డీపీఆర్ ఓ కార్యాలయం అనే దొడ్లో కట్టేసి గొంతులు బిగించిండు. వాళ్లను తను ఆడిందే ఆడాలని, తను పాడిందే పాడాలని నెల జీతం ఇచ్చి కట్టు బానిలుగా కట్టేసుకుండు. ఇక తనను ప్రశ్నించే గొంతు లేదనే అహంకారంతో విర్రవీగుతూ ఉద్యమకారుల మాటను పెడచెవిన పెడుతుండు. ఈ భారత దేశంలో స్వయం పాలన కోసం జరిగి అస్థిత్వ ఉద్యమాలతో ఏర్పడిన రాష్ట్రాలన్నీ తమ ఉద్యమ కారులను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాయి,. భారత ప్రభుత్వం కూడా ఈ దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న బిడ్డకు కూడా పింఛన్ ఇచ్చి గౌరవించుకుంది. జార్ఛండ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యమ వీరులను సమున్నతంగా గౌరవించుకుంటున్నాయి. మేథావులకు, విద్యావంతులకు పాలనలో స్థానం కల్పించడం, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం, వయోవృద్దులకు పించన్లు ఇవ్వడం, విద్యా వైద్య రంగాల్లోప్రత్యేక రాయితీలు కల్పించడం, భూమి కేటాయించడం వంటి సౌకర్యాలు కల్పించి వారిని కడుపులో పెట్టుకుంటున్నాయి. కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులంటే చీడపురుగులతో సమానంగా చూడటం ఒక ఎత్తైతే తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి ఫీఠం పై కూర్చోబెట్టి ఉద్యమాన్ని ఎగతాళి చేయడం మరో తంతు. కేవలం తన కోసం తన కుటుంబం కోసం మాత్రమే యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినట్టు స్పష్టం అవుతోంది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో చక్రంతిప్పాలన్న ఆయన రాజ్య కాంక్ష రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే కేంద్రంతో తలకొరివి పెట్టుకొని పచ్చి బాలింతలా ఉన్న రాష్ట్రనికి రావాల్సిన నిధుల పై కత్తిగట్టే వైఖరి ప్రదర్శించి యావత్ తెలంగాణ బిడ్డలకు ద్రోహం చేసే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నట్టు అర్ధంమవుతోంది. ఇది మేథావులు, ఉద్యమకారులు మళ్లీ గొంతు విప్పాల్సిన సందర్భం. ప్రశ్నించాల్సిన సందర్భం. ఈ సదర్భంగా ప్రతి ఉద్యమకారుడి కుటుంబం నుంచి ఒకరు ఈ మలిఉద్యమంలో చేయి చేయీ కలపాలి. ధిక్కార స్వరం వినిపించి భాస్వరమై మండాలి. ఉద్యమకారుల ఉనికి ప్రతి నిముషం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెవుల్లో మారుమోగాలి. ఉద్యమకారుల కుటుంబాలు గతంలో ఇచ్చిన హామీలు, ఉద్యమకారుల త్యాగాల పోస్టింగ్స్ పై దృష్టి పెట్టాలి. తన దొడ్లో కట్టేసుకున్న కళాకారుల ఉత్తుత్తి ఉద్యోగాల నుంచి బయటకు వచ్చి తన దీర్ఘకాలిక ఉపాధి కోసం గొంతు విప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణను తిరోగమనంలోకి నెట్టేవిధంగా ఉన్నవన్న విషయం గ్రహించి,. జనచైతన్యం కోసం పాటు పడాలి. దొరల పెత్తందారీ వ్యవస్థ ఉక్కు పిడికిళ్ల నుంచి తెలంగాణను కాపాడుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఏ తెలంగాణ కోసమైతే బలిదానాలు చేశామో, అదే తెంగాణ ఈనగాచి నక్కల పాలు కాకుండా కాపాడుకోవాలి. అంతే కాదు తెలంగాణ కోసం ఉక్కు సంకల్పంతో పోరాడి అసువులు బాసిన కుటుంబాలకు అండగా నిలబడాలి. ఉద్యమంలో పోరాడి నేడు నిరుద్యోగులుగా, రాజకీయ ఖైదీలుగా, నిందితులుగా బతుకులీడుస్తున్న ఉద్యమకారులను అక్కున చేర్చుకొని వాళ్లను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. ఇది బంగారు తెలంగాణ అని కల్లబొల్లి కబుర్లు చెప్పి. తప్పటడుగులు వేస్తుంన్న తెలంగాణ, అని తప్పుడు అడుగులు వేస్తున్న ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాల్సిన బాధ్యత. ఉద్యమకారుల ఐక్య వేదిక సభ్యులందదిరి. ఇది మరో పోరాటం. ఇది మనందరి పోరాటం. ఈ పోరాటం మనకోసం, మన కుటుంబాల కోసం మాత్రమే కాదు, ముందు తరాల భవిష్యత్ కోసం చేసే పోరాటం. మలి దశ ఉద్యమాన్ని మించిన మహోన్నత పోరాటం కావాలి. దీని కోసం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి నడవాలి.
ఖమ్మం/ అక్షిత బ్యూరో—