గిరిజనుల గళం ‘రామ్ చందర్ నాయక్’
* ట్రైకార్ చైర్మన్ కు మిర్యాలగూడలో ఘన సన్మానం
* గిరిజనుల అభ్యున్నతికి కోసం ఆది నుంచి ‘రామ్ చందర్ నాయక్’ది అలుపెరగని పోరాటం
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
గిరిజనుల గళం ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అభివర్ణించారు. గతనెల 13న తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్) చైర్మన్‌గా రామ్ చందర్ నాయక్ ప్రమాణం చేశారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ఎస్వీ గార్డెన్స్ లో నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో ట్రైకార్ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. గిరిజనుల అభ్యున్నతికి కోసం ఆది నుంచి ‘రామ్ చందర్ నాయక్’ది అలుపెరగని పోరాటమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడి పదవిని సమర్థవంతంగా నిర్వర్తించారని అన్నారు. గిరిజనుల, రైతుల సమస్యల గురించి ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకొచ్చి తక్షణ పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం పాటుపడటంలో రామ్ చందర్ నాయక్ ఎల్లప్పుడూ ముందుంటారని భాస్కర్ రావు ప్రశంసించారు. అనంతరం ఇస్లావత్ రామ్ చందర్ నాయక్, ఆయన సతీమణి కల్పనాను గజమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు.

అంతకుముందు మిర్యాలగూడ పట్టణంలోని ఫ్లైఓవర్ నుంచి ఎస్వీ గార్డెన్స్ వరకు బంజారా యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, నాయకులు ధీరావత్ స్కై ల్యాబ్ నాయక్, దామరచర్ల మండల జడ్పీటీసీ అంగోతు లలిత హాతిరామ్ నాయక్, ఎంపీపీ ధీరావత్ రవితేజ నాయక్, కుర్ర సేవ్యా నాయక్, బాలాజీ నాయక్, బంజారా నాయకులు,తదితరులు పాల్గొన్నారు.