విఆర్ఏలను అవమానించిన కెసిఆర్ ను గద్దె దింపుతాం..
మునుగోడులో సారా కూర కార…
డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్ర అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ
మునుగోడు, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గత 70 రోజులుగా 23 వేల మంది విఆర్ఎలు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే,లాఠీచార్జ్ చేసి అణచివేసే ప్రయత్నమే కాకుండా బెదిరింపులకు గురి చేస్తూ అవమాన పరిచారని, దొరల అహంకారాన్ని ప్రదర్శించారని డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.నిన్న వరంగల్ లో తమ డిమాండ్లను నెరవేర్చాలని కలిసిన విఆర్ఏను తమాషా చేస్తున్నారా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.ప్రజాస్వామ్య బద్దంగా తమ న్యాయమైన హక్కులకోసం పోరాడుతుంటే అణచివేస్తూ రాజ్యాంగవిరుద్దంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.కానీ బహుజన రాజ్యంలో విఆర్ఏ, విఆర్వోలను కడుపులో పెట్టి కాపాడు కుంటామని తెలిపారు.రెవెన్యూవ్యవస్థలో స్వర్ణ యుగం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ లో దవాఖాన ప్రారంభించడానికి వెళ్లిన కెసిఆర్ మర్రిగూడ దవాఖానకు ఎందుకు రావడంలేదని నిలదీశారు. మర్రిగూడం మండలంలో హాస్పిటల్ నిర్మించి మూడేళ్లు గడిచినా ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు.కమీషన్లు ఇచ్చే కార్పొరేట్ హాస్పిటల్స్ కి మాత్రమే వెళ్తున్నారని,కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల వల్ల మరణించిన కుటుంబాల దగ్గరికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.బిఎస్పి పాలనలో వైద్యం కోసం పుస్తెలు,ఆస్తులు భూములు అమ్ముకునే రోజులు పోతాయని స్పష్టం చేశారు. మర్రిగూడం మండలంలోని చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక బస్సు రాకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్నారు. ప్రజలకు అవసరమైన విద్య వైద్యం ఇవ్వకుండా ఆధిపత్య పార్టీలన్నీ అక్రమంగా సంపాదించి కూడబెట్టుకున్న సొమ్మును మునుగోడులో పంచి గెలవాలని చూస్తున్నాయని విమర్శించారు.ఒక పార్టీ సు,క్కముక్క అంటుంటే మరో పార్టీ కార కూర సారా అంటుందని ఎద్దేవా చేశారు.మళ్ళీ ఇపుడు దసరాకు ఇంటింటికి కిలో మటన్ పంచడానికి రెడీ అయ్యాయని విమర్శించారు.బిజెపి పార్టీ దేశాన్నంతా దోచి అంబానీ, అదానీలకు పెడుతుందని ఆరోపించారు.బిసిల కులగణన చేయకుండా మోసం చేసిన బిజెపి పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు.కానీ బహుజన్ సమాజ్ పార్టీ పేదల బతుకులను మార్చడానికి,పేదలను కాంట్రాక్టర్లుగా,వ్యాపారస్తులుగా తయారుచేసి వారి ఇళ్లలో సంపద ఇవ్వడానికి వచ్చిందని వెల్లడించారు. రోజురోజుకూ బిఎస్పి పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి దొరలు, ఆధిపత్య పార్టీల నాయకులు తట్టుకోలేక పోతున్నారని, అందుకే బిఎస్పి జెండా గద్దెలు కూల్చుతున్నారని,కేసుల పేరుతో బెదిరిస్తున్నారని కానీ భయపడేది లేదని,ఆధిపత్య పార్టీలను అంతం చేస్తామని హెచ్చరించారు.యర్రగండ్లపల్లిలో జెండా గద్దెను కూల్చగా,కూల్చిన చోటనే తిరిగి జెండా ఎగురవేశారు.పార్టీలో యువకులు భారీగా చేరుతున్నారని, యువకులతోనే దొరల పాలన అంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ రోజు యాత్ర మర్రిగూడం,యర్రగండ్లపల్లి,అజిలాపురం,నరసింహ్మపురం,భట్లపల్లి గ్రామాల్లో పర్యటించి,పార్టీ జెండాలు ఆవిష్కరించి,యువకులను మహిళలను పార్టీలోకి ఆహ్వానించారు.యాత్ర అనంతరం ఎస్ డబ్ల్యూ లింగోటం, టిపి గౌరారం, వడ్ఢేపల్లి, తుంగాపహాడ్, మళ్ళాపూరజ్ పల్లిలో పర్యటించనున్నారు. యాత్రలో జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు,కర్నాటి శ్రీనివాస్, ఏర్పుల అర్జున్,అబేందర్,పల్లేటి రవీందర్,కత్తుల పద్మ యాదవ్,ఎలిజబెత్,నిర్మల తదితరులు పాల్గొన్నారు.