
ఎస్సీ వర్గీకరణకై
ఇక ప్రత్యక్ష పోరు
మాదిగల దృష్టిలో బీజేపీనే నం.1 దోషి
100 రోజుల్లో పరిష్కరిస్తామని…
9 ఏళ్లుగా జాప్యమెందుకు?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం
ఫిబ్రవరి 10న హైదరాబాద్.. విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం
విలేకరుల సమావేశంలో భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
వంద రోజులన్నరు…9 ఏళ్లు వేచి చేశాం. ఇక ఆలస్యం చేయం… ఇక కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం. ఇక ప్రత్యక్ష పోరుకై శ్రేనులంతా సన్నద్ధమవ్వాలి. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ డిమాండ్ ను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వివిధ కమీషన్ ల నివేదికలు అనుకూలంగా ఉన్నా, ఉమ్మడి ఏపీ, కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా, 9 ఏళ్లుగా బీజేపీ అధికారంలో వున్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ద్వజమెత్తారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్), మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్పీ)లు ఇటీవల బెంగళూరులో నిర్వహించిన జాతీయ సమావేశాల వివరాలను మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత విషయంలో కేంద్రంలోని బిజెపి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలలో వర్గీకరణ మాదిగలకు చాలా కీలకమైన అంశం అన్నారు. దశాబ్దాలుగా బిజెపి హామీ ఇస్తూ మోసం చేస్తున్నట్టు తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే సమస్య పరిష్కారం అవుతుందని బిజెపి చెబుతుందని తెలిపారు. కానీ కర్ణాటకలో.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కర్ణాటకలో ఎందుకు వర్గీకరణ చేయలేదని విమర్శించారు. కర్ణాటకలో సదాశివ కమిషన్ అనుకూలంగా నివేదిక ఇచ్చినా, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా వర్గీకరణ ఎందుకు చేయలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నప్పటికీ మాదిగల దృష్టిలో బీజేపీ ప్రధాన దోషి అని స్పష్టం చేశారు. 2014లో కిషన్ రెడ్డి, దత్తాత్రేయలను ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన సమయంలో వర్గీకరణకు హామీ ఇచ్చారన్నారు. కేంద్రంలో బిజెపికి అనుకూలమైన బిల్లులను మాత్రమే పార్లమెంటులో ఆమోదం పొందుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో విజ్ఞప్తులు చేశామని ఇకనుంచి సమరానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. వర్గీకరణ ఆఖరి పోరాటంలో భాగంగా ముందుగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరడం వినతి పత్రాలు అందజేస్తామని అన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుంటే ఎంఆర్పిఎస్ కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళన చేస్తామన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి కోదాడ సమీపంలోని తెలంగాణ బోర్డర్ వరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ మాదిగ, కార్తీక్, సోమశేఖర్ ఆధ్వర్యంలో.. విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, రుద్రపోగు సురేష్ ఆధ్వర్యంలో పాదయాత్ర ఉంటుందన్నారు. 10వ తేదీన హైదరాబాద్ … విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనాధ పిల్లల సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేయనున్నట్లు తెలిపారు. అనాధ పిల్లలకు ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ప్రత్యేక విద్యా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై గతంలో మంత్రివర్గ ఉప సంఘం పలు నిర్ణయాలు చేసిందని అన్నారు. అయినప్పటికీ మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయాలను ప్రభుత్వం నేటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. అనాధ పిల్లలకు స్మార్ట్ కార్డులు అందజేయాలని, ప్రత్యేక రిజర్వేషన్ కోటాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, జాతీయ సలహాదారులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, అనాధ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.