భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
ఏబీఎన్ టీవీ ఛానల్ కు రిపోర్టర్ గా పనిచేస్తున్న రాజు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. రాజు గత అనేక సంవత్సరాలుగా ఎలక్ట్రాన్ మీడియాలో పనిచేస్తూ అందరితో మంచిగా ఉండేవాడు. రాజు మరణంతో మంచి మిత్రుని కోల్పోయినట్లుగా తోటి జర్నలిస్టులు ఎంతో బాధపడ్డారు. రాజు నివాసం జూలూరుపాడు కావడంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు రాజు ఇంటికి వెళ్లి ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించడం జరిగింది. ఇదిలా ఉండగా జర్నలిస్టు రాజు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సంతాపం తెలిపారు. జర్నలిస్ట్ రాజకుమార్ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. సీనియర్ జర్నలిస్టుగా మీడియా రంగంలో తను అందించిన సేవలను కొనియాడారు.రాజు ఆకస్మిక మృతి పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి గల కారణాలను డిపిఆర్ఓను అడిగి తెలుసుకున్నారు. సోమవారం తెల్లవారు జామున తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వైద్య చికిత్స తీసుకుంటూనే కుప్పకూలిపోయారని అతని మరణం చాలా బాధాకరమని చెప్పారు. అందరితో ఎంతో కలివిడిగా ఉండేవారని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా రాజు మరణం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు వ్యాపారస్తులు సంతాపం తెలిపారు.