మిమ్మల్ని మీరు చదువుకోవటమే సిసలైన విద్య
-ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు అట్లూరి వెంకటరమణ స్పష్టీకరణ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :మనలోని లోపాలను గుర్తించి బలాబలాలు బేరీజు వేసుకుంటూ జీవితాన్ని ఉన్నత స్థితికి చేర్చుకోవటమే నిజమైన చదువని ప్రముఖ కవి రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణులు అట్లూరి వెంకటరమణ స్పష్టం చేశారు.ఖమ్మం ఎన్నేస్పీ కాలనీలోని గిరిజన కళాశాల వసతి గృహ ప్రాంగణంలో వసతి గృహ సంక్షేమ అధికారిని నాగమణి అధ్యక్షతన వసతి గృహ విద్యార్థినులకు ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస తరగతిలో అట్లూరి ప్రపంచ గమనంలో యువతకు ఉన్న అవకాశాలు జీవితంలో విజయం సాధించడానికి కావలసిన ఆయుధాల సమీకరణ అనే అంశంపై ఉత్తేజిత ప్రసంగం చేశారు.నాలుగు వందల మంది విద్యార్థులు హాజరైన ఈ సమావేశంలో ఎవరైతే పుస్తకం సమాజం జీవితాలను సునిశితంగా అధ్యయనం చేస్తారో వారిదే విజయమని అంటూ దేశానికి స్వేచ్ఛను సాధించటానికి తమ సర్వస్వం ఒడ్డిన ఎంతో మంది నారీమణుల స్ఫూర్తి మన శ్వాసగా చేసుకుని ఎదగటానికి ప్రయత్నం చేయాలని అన్నారు.సాంకేతిక విప్లవ విజృంభణలో మానవీయతా విలువలతో జీవించటం ఒక సవాలుగా మారిందని నైతికత మానసిక ప్రశాంతత జీవితానికి ప్రధాన ఇరుసులని మీ మీద ఆశలు పెట్టుకుని మీరే జీవితంగా మీరు ఇచ్చే ఫలితాల కోసం వేయి కనులతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.
మదర్ ధెరిస్సా మలాలా ఆంగ్ సాన్ సూకీ వంటి స్త్రీ మూర్తుల జీవితాలను గమనిస్తే స్త్రీ తలుచుకుంటే అసాధ్యం లేదని అర్ధం అవుతుందని ఉత్తేజపరిచారు.ఒకే ఒక జీవితం ఒకే ఒక లక్ష్యం అనే నినాదంతో ముందుకు సాగాలని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మరొక వక్త తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యసాధన కొరకు ప్రణాళికలు రూపొందించుకొని జీవితంలో గొప్ప పౌరులుగా ప్రయోజకులుగా నిలవాలని ఆకాంక్షించటం జరిగింది. ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకొని గురువుల మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్లాలని చెప్పారు.ఈ యొక్క కార్యక్రమంలో గిరిజన కళాశాల బాలికల వసతి గృహ నాలుగవ తరగతి సిబ్బంది పాల్గొన్నారు.