కన్నుల పండువగా… కంటి వెలుగు

కన్నుల పండువగా కంటి వెలుగు 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కంటి వెలుగు కార్యక్రంలో భాగంగా ఇప్పటి వరకు 507, గ్రామ పంచాయితీలు, 205 మున్సిపల్ వార్డుల్లో కంటివెలుగు శిబిరాలు పూర్తి చేసి 12.29 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 2,94,462 మందికి రీడింగ్ గ్లాసులను అందచేయడంతోపాటు 2,05,334 మందికి కొత్తగా కళ్లద్దాలు తయారీకి ప్రతిపాదనలు అందాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. నేడు బీఆర్ కేఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో కంటి వెలుగు, ఉపాధ్యాయుల బదిలీలు, మన ఊరు- మన బడి, ఆయిల్ పామ్, కొత్తగా ప్రారంభించుకున్న కలెక్టరేట్ల లో కార్యాలయాల నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.కంటి వెలుగుపై సమీక్షిస్తూ, రాష్ట్రం లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను అభినందించారు. కంటి వెలుగు లో ప్రతీ రోజూ సుమారుగా 2లక్షల మందికి పరీక్ష చేసి, 50,000 కళ్ళద్దాలను ఉచితంగా అందించామని వెల్లడించారు. కంటి వెలుగు క్యాంపులలో నిర్వహించే పరీక్షల వివరాలను మెడికల్ రికార్డులలో ఏవిధమైన పొరపాట్లు లేకుండా నింపాలని అన్నారు. ఈ విషయంలో జిల్లా స్థాయిలో ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ కమిటీల ద్వారా తనిఖీ చేయించాలని సూచించారు.

అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలను చేపట్టాలి

సుదీర్ఘ కాలం తర్వాత చేపట్టే ఉపాధ్యాయ బదిలీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో పూర్తి చేయాలని సి.ఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు చేపట్టిన ఈ బదిలీల ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని పేర్కొన్నారు. పూర్తిగా ఆన్ లైన్ విధానం ద్వారా జరిపే ఈ బదిలీల ప్రక్రియపై ఉపాధ్యాయుల నుండి అందే ఫిర్యాదులు, దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవియన్స్ రిడ్రెసల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఇప్పటివరకు 53 వేల దారఖాస్తులు అందాయని, ఇవి 75 వేల వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రతి రోజూ జిల్లా విద్యా శాఖాధికారులతో సమీక్షించాలని సి.ఎస్ కోరారు.

ఫిబ్రవరి 1 వ తేదీ నుండి మన ఊరు-మన బడి ప్రారంభోత్సవాలు

రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, బోధనేతర పరికరాల ఏర్పాటు తదితర సదుపాయాలు, మౌలిక సదుపాయాల కల్పనపై చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా పూర్తైన పాఠశాలలను ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ మన ఊరు – మన బడి కార్యక్రమం ప్రారంబోత్సవాలు పండుగ వాతావరణంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ లను పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో

అగ్రగామిగా తెలంగాణ

ఆయిల్ పామ్ ప్లాంటేషన్ భాగంగా ప్రస్తుత సంవత్సరం రాష్ట్రంలో ఇప్పటివరకు 57 వేల ఎకరాలలో ప్లాంటేషన్ ను చేపట్టడం ద్వారా దేశంలోనే ముందంజలో ఉన్నామని సి.ఎస్ వెల్లడించారు. జిల్లాలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్లపై సమీక్షిస్తూ, ఇప్పటికే, 57 వేల ఎకరాలలో ప్లాంటేషన్ పూర్తికాగా మరో 60 వేల ఎకరాలలో ప్లాంటేషన్ జరుగుతోందని, ఈ మార్చి వరకు మొత్తం లక్ష్యాన్నిసాధించాలని కలెక్టర్లకు తెలియ చేశారు.

కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ లకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలి

రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించుకున్న 17 నూతన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ లకు అని ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలని వారంలోగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యార్ధం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే భవనం లో ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశ్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కాంప్లెక్స్ లకు వారంలోగా తరలించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యా శాఖ కమీషనర్ దేవ సేన, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మొహంతి, ఎస్.సి డెవలప్మెంట్ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఉద్యానవన శాఖ ఇంచార్జ్ కమీషనర్ హనుమంత రావు, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking