అనాధ హక్కుల రక్షణకై పోరు

అనాధ హక్కుల రక్షణకై పోరు
777 రోజులుగా నెరవేరని హామీలు
మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

అనాథల హక్కుల సాధనకై యుద్ద భేరి మోగింది. సాక్షాత్తు సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీలను అమలు నేటికీ కార్యరూపం దాల్చలేదు.777 రోజులు గడిచిపోవడంతో ఆయా హామీల అమలుకై అనాథల అరిగోస దీక్షకు నగారా మోగింది.అనాథ హక్కుల పోరాట వేదిక ( ఎంఎస్ పి, ఎమ్మార్పీఎస్ తెలంగాణ ) ఆధ్వర్యంలో అనాథల అరిగోస 777 మూవ్ మెంట్ పేరిట దీక్ష సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో దీక్షకు కూర్చున్న మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీని ఈ రోజు వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కేసిఆర్ కు ఇష్ట దైవం అయిన యాదగిరిగుట్టలోనే మొదటి అనాథ పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని, రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి విఫలం అయ్యాడని ధ్వజమెత్తారు. అనాథల పై కెసీఆర్ కు ఉన్నది ముసలి కన్నీరు కారుస్తున్నారని మండి పడ్డారు. దేశం గర్వించే విధంగా అనాథల కోసం సమగ్ర చట్టం తెస్తామని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

అనాథల కోసం చట్టం తెచ్చేందుకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించి, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. మంత్రి వర్గం ఉప సంఘం చేసిన 8 తీర్మానాల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. కెసీఆర్ ఇచ్చిన హామీలు చెత్త కుప్పల్లో వేసినట్లే భావించాల్సి వస్తుందన్నారు. కెసీఆర్ తల దించైన, మెడలు వంచి అయిన అనాథలకు ఇచ్చిన హామీలును అమలు చేయించాల్సిందే అని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర ఫలాలు అనాథలకు ఏమైనా అందాయా అని ప్రశ్నించారు. దేశంలో ప్రతి నిర్ణయం ఓటు కోసం అమలు అవుతుందన్నారు. అనాథల చట్టం కోసం రేపటి నుంచే కార్యాచరణను చేపట్టినట్టు, అందులో భాగంగా హామీలు ఇచ్చిన సమయంలో కెసీఆర్ తో, కెటిఆర్ తో ఎవరెవరు ఉన్నారో వారందరినీ పది మంది అనాథల పిల్లలతో కలుస్తామని స్పష్టం చేశారు. కెసీఆర్ కు నిమ్మ రసం ఇచ్చిన ఇద్దరిలో నేను ఉంటానని, కానీ ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. చట్టం తీసుకు రాక పోతే ఇలాంటి దీక్షలు ప్రతి జిల్లా కేంద్రాల్లో నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓటు కోసమే రాజకీయం చేస్తున్నారని అన్నారు. మంత్రి మల్లారెడ్డి లాంటి ధనవంతులకు కోట్ల రూపాయలు అందే రైతు బంధు రద్దు చేస్తే అనాథ పిల్లలను ఆదుకోవచ్చు కదా అని అన్నారు. మోసగాడిగా ఉండి పోతావో.. అనాథలకు మంచి చేసిన సీఎంగా ఉండి పోతావో అనేది తేల్చుకో అని కెసిఆర్ కు మంద కృష్ణ మాదిగ హితవు పలికారు.హృద్రోగుల కోసం పోరాటం చేస్తే అప్పటి సీఎం వై ఎస్ రాజశేఖర రెడ్డి రాజీవ్ ఆరోగ్య శ్రీ తెచ్చారని తెలిపారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ అనాథ పిల్లలకు ఇచ్చిన మాటను మరిచిపోయే తత్వం కెసీఆర్ ది అని ధ్వజమెత్తారు. ఏదో చెబుతావు ఊత పదం పలుకుతావు.. తర్వాత మర్చిపోతావని కెసీఆర్ ను విమర్శించారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వైఎస్సార్ టి పి నాయకుడు ఏపూరి సోమన్న, బిజెపి నాయకురాలు విజయ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ తదితరులు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ సచివాలయం పేరుతో, రైతు బంధు పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అనాథ హక్కుల పోరాట వేదిక కార్యనిర్వహక అధ్యక్షుడు బి.వెంకటయ్య, ప్రదీప్ గౌడ్, తిప్పారపు లక్ష్మణ్, గోవింద్ నరేష్, రాజు తదితరులు దీక్షలో కూర్చున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking