
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలం
చేర్యాల,జనవరి 31అక్షిత న్యూస్: చేర్యాల మండల ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య అన్నారు.మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,ఎన్నికల సమయంలో ప్రతీ నిరుపేద కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి పంపిణీ చేస్తామని వాగ్దానాలు చేసి,ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను అమలు చేయకుండా,ఏదో ఒక గ్రామంలో కొద్ది గొప్ప ఇండ్లు నిర్మించి చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు. చేర్యాల పట్టణంతోపాటు పలు గ్రామాలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ప్రజల ఆశలను నిరాశపరిచిందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రజలపై దృష్టి సారించి వెంటనే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధులు, పట్టణ కార్యదర్శి బుడుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.