
కేంద్రానిది రైతు వ్యతిరేక బడ్జెట్
మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
కేంద్ర బడ్జెట్ పూర్తిగా రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి నిధుల్లో దాదాపు 30 శాతం కోత విధించడాన్ని మంత్రి తప్పుబట్టారు. ఎరువుల సబ్సిడీని తగ్గించి రైతులపై అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణపై ఎప్పటిమాదిరిగానే నిర్లక్ష్యం చూపారన్నారు. పేదలకు మాత్రం అన్యాయం చేస్తూ, కార్పొరేట్లకు మాత్రం అనుకూలంగా బడ్జెట్‌ను రూపొందించారని చెప్పారు. బీజేపీ హయాంలో ఇప్పటికే రికార్డు స్థాయి అప్పులు చేశారని, ఈ ఏడాది దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూడడం దురదృష్టకరమన్నారు. విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు కేంద్రం పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. విభజన హామీల గురించి కనీస ప్రస్తావన కూడా లేదని వాపోయారు. రాష్ట్రానికి ప్రోత్సాహకాలు అడిగితే ఇవ్వలేదన్నారు. ఏ ఒక్క రంగానికి కూడా సంపూర్ణ న్యాయం చేయలేదని, ఇదొక భ్రమల బడ్జెట్ అని మంత్రి విమర్శించారు.