ముమ్మాటికి… మాది కుటుంబ పాలనే

బరాబర్‌ మాది కుటుంబపాలనే..

విపక్షాలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని తెలిపారు. తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబసభ్యులే.. ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్‌ అని స్పష్టం చేశారు. బరాబర్‌ ఇది కుటుంబ పాలనే.. కాదని ఎవరు అంటారో మేం కూడా చెబుతామంటూ వివరించారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో.. ఏ ముఖ్యమంత్రి ప్రతి కుటుంబంలోని అవ్వ, తాతకు పెన్షన్లు ఇచ్చి ఒక పెద్ద కొడుకులా నిలబడ్డడు. ఒక్క కేసీఆర్‌ తప్ప. 4 కోట్ల మంది తోబుట్టువులను దగ్గర ఉండి చూసుకుంటున్నది కేసీఆర్‌ కాదా.? కంటి వెలుగుతో వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగులు ఇస్తున్నది కేసీఆర్‌ కాదా? గురుకులాలు, జూనియర్‌ కాలేజీలు, మెడికల్‌ కళాశాలలు తెరిచి లక్షలాది మందికి నాణ్యమైన విద్య అందిస్తున్నది కేసీఆర్ కాదా? ఊహించని విషాదంతో ఒంటరిగా మిగిలిన చెల్లెళ్లకు ఒంటరి మహిళ పెన్షన్లు ఇస్తున్నది వాళ్ల పెద్దన్న కేసీఆర్‌ కాదా? బస్తీల్లోని పసిబిడ్డ అయినా.. బంజారాహిల్స్‌లో పుట్టిన బిడ్డకు అయినా సమానంగా సకల సౌకర్యాలు అందించేందుకు కేసీఆర్‌ కిట్‌కు రూపకల్పన చేసి కంటికిరెప్పలా కాపాడుతున్న మేనమామ కేసీఆర్‌ కాదా? పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీ, షాది ముబారక్‌ కింద 12 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్‌ కాదా? 65 లక్షల మంది రైతులకు 65వేల కోట్లు ఇచ్చి అన్నగా నిలబడినది కేసీఆర్‌ కాదా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎస్‌.. మాది కుటుంబ పాలననే అని స్పష్టం చేశారు. ఇది వసుదైక కుటుంబం.. దీనికి మా పెద్ద కేసీఆర్‌ అని బరాబర్‌ చెబుతం అంటూ తెలిపారు. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న పేగుబంధాన్ని తెంపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking