
అంబేద్కర్ త్యాగంతోనే అణగారిన ప్రజలకు హక్కులు…
అంబేద్కర్ జీవితం అందరికి ఆదర్శం
బలహీన వర్గాల ప్రజలు అంబేద్కర్ జీవిత చరిత్ర అధ్యయనం చేయాలి…
ప్రజా యుద్ధనౌక గద్దర్
మేడ్చల్, అక్షిత బ్యూరో :
అంబేద్కర్ త్యాగంతోనే అణగారిన వర్గాల ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారా హక్కులు లభించాయని, మను ధర్మం కులాల వారిగా ప్రజలను విభజిస్తే అంబేద్కర్ ఆచరించిన దర్మం మనుషుల మధ్య సమానత్వాన్ని తెచ్చిందని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. జగద్గిరిగుట్ట లో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైనాడు. ఈ సందర్బంగా గద్దర్ మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాలుగా కనీస హక్కులు లేకుండా మనుషులు గా గుర్తించబడని పీడీత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నాడు.అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదని ప్రపంచమే స్ఫూర్తి గా తీసుకున్న సామజిక ఉద్యమ శక్తి అని, అంబేద్కర్ జీవితం అందరికి ఆదర్శం అని అన్నాడు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఓటు విలువ తెలుసుకొని అణగారిన ప్రజలు అధికారం లోకి రావాలని పిలుపునిచ్చారు.అంబేద్కర్ సమస్త పీడీత ప్రజల విముక్తి కోసం మనువాదులతో పోరాటం చేసాడని, కానీ నేడు అంబేద్కర్ చరిత్ర తెలుసుకోకుండా కొన్ని వర్గాల ప్రజలకే అంబేద్కర్ ను పరిమితం చేసే కుట్ర జరుగుతుందని పేర్కొన్నాడు.దళితుల ను మళ్ళీ వివక్ష కు గురిచేసేలా, వారి హక్కుల్ని హరించేలా కుట్ర జరుగుతుందని దళిత బహుజన ప్రజలు అప్రమత్తం గా ఉండాలని పిలుపునిచ్చాడు.ఈ దేశ కుల వ్యవస్థ తీరును కళ్లకు కట్టేలా చిన్నారులతో కలిసి సామాజిక అవగాహన ప్రదర్శన చేసాడు.అనంతరం జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కే. జగన్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్ దే అని భారత రాజ్యాంగంలో ఆయన పొందుపరచిన ఆర్టికల్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నాడు.బలహీన వర్గానికి చెందిన తనలాంటి వారు ప్రజాప్రతినిధులు అవుతున్నారంటే ఆది అంబేద్కర్ చేసిన త్యాగ పాలితమే అని పేర్కొన్నాడు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ప్రజా కళాకారుడు మాపల్లె శంకర్ ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, సిఐ సైదులు,ఎస్ఐ యాదగిరి,బహుజన నాయకులు,పలు పార్టీల నాయకులు, యువజన, మహిళా నాయకులు,స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..