*క్రమశిక్షణ చర్యల పేరుతో సింగరేణి మైనింగ్ సిబ్బందిని వేధించవద్దు*

 

*క్రమశిక్షణ చర్యల పేరుతో సింగరేణి మైనింగ్ సిబ్బందిని వేధించవద్దు*

*మంచిర్యాల, అక్షిత బ్యూరో :

సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాలోని కేటికే 8ఇంక్లైన్ గనిలో జరిగిన గని ప్రమాదానికి మైనింగ్ సిబ్బందిని బాధ్యుల్ని చేస్తూ, సింగరేణి యాజమాన్యం తీసుకున్న తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకోవాలని, క్రమశిక్షణ చర్యల పేరుతో మైనింగ్ సిబ్బందిని వేధించవద్దని మైనింగ్ స్టాప్ ఐక్య వేదిక నాయకులు, టిబిజికెఎస్, ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టియుసి నాయకులు డిమాండ్ చేశారు.

ఈమేరకు గురువారం మందమర్రి ఏరియా జిఎం కార్యాలయంలో ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా టిబిజికెఎస్, మైనింగ్ స్టాప్ ఐక్య వేదిక నాయకులు వేర్వేరుగా జిఎం కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మైనింగ్ స్టాప్, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ఉత్పత్తి సాధనకు మైనింగ్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని, యజమాన్యం వారి సేవలను వాడుకుంటూ, గనిలో జరిగే ప్రమాదాలకు కేవలం మైనింగ్ సిబ్బందిని మాత్రమే బాధ్యులు చేసి క్రమశిక్షణా చర్యలకు పూనుకోవటం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు. భూపాలపల్లి ఏరియాలోని కేటికే 8ఇంక్లైన్ గనిలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదానికి ముగ్గురు మైనింగ్ సూపర్ వైజర్లను బాధ్యులుగా చేస్తూ, వారికి ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా వారి హెూదాను తగ్గించడం, ఇంక్రిమెంట్ల కోత విధించడంతో పాటు షార్ట్ ఫైరర్ గా పనిచేస్తున్న ప్రకాష్ ను ఏకంగా డిస్మిస్ చేయడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. ఇంతటి తీవ్రమైన చర్య గతంలో ఏనాడు సింగరేణి యాజమాన్యం విధించలేదన్నారు. సింగరేణి సంస్థల్లో జరిగిన అతి పెద్ద ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, అయినప్పటికిని సింగరేణి యాజమాన్యం ప్రమాదాలకు బాధ్యులుగా నిర్ధారించిన అధికారులు, సూపర్వైజర్లపై ఇంతటి తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని, ఇటువంటి తీవ్రమైన క్రమశిక్షణ చర్య వలన మైనింగ్ సిబ్బంది మానసికంగా తీవ్రంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకారం పని చేయించాల్సిన బాధ్యత అధికారులదే అని వాటిని అతిక్రమించారని, విధుల్లో నిర్లక్ష్యం వహించారని , సిఎంఆర్ ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించడం తగదని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని మైనింగ్ సిబ్బందిపై విధించిన తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యానికి, మైనింగ్ సూపర్వైజర్లకు మధ్య సుహృద్భావమైన వాతావరణం నెలకొనే విధంగా యాజమాన్యం ప్రయత్నించాలని, ఏకపక్షంగా క్రమశిక్షణ చర్యలకు యజమాన్యం దిగడం వలన సంస్థలో పారిశ్రామిక అశాంతి నెలకొనే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. సిఎంఆర్ నిబంధన ప్రకారం నడుచుకుంటూ, గని రూల్స్, మైనింగ్ చట్టాన్ని అమలు పరచడానికి శక్తివంచన లేకుండ కృషి చేస్తున్న మైనింగ్ సిబ్బంది వారి విధి నిర్వహణలో ఎవరికి గాయం కాకూడదని కోరుకుంటూ పనులను పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. మైనింగ్ సిబ్బంది, వారి కుటుంబాల మానసిక ఆందోళనను అర్థం చేసుకొని, తక్షణమే మైనింగ్ సిబ్బందిపై విధించిన క్రమశిక్షణా చర్యలను పునః పరిశీలించి, రద్దు చేసి, మైనింగ్ సిబ్బంది చేసే పనులలో సహకరిస్తూ, వారిలో నెలకొని ఉన్న భయాన్ని తొలగిస్తూ, భరోసాను అధికారులు, ఉన్నత స్థాయి యాజమాన్యం అందించాలని కోరారు. అనంతరం ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ మైనింగ్ సిబ్బంది ఆవేదనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియాలోని టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శులు సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, సిఐటియు మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఐఎన్టియుసి కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఏరియాలోని మైనింగ్ స్టాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking