
సర్దార్ కు స్మృత్యంజలి
కమ్యూనిస్టులకు పెట్టని కోటగా ఉన్న నల్గొండ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ ను సుస్థిరం చేసిన ధీటైన లీడర్ సర్దార్ చకిలం శ్రీనివాస్ రావు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలను స్పృశిస్తే…. చకిలం శ్రీనివాస రావుకు ముందు తర్వాత అని చెప్పుకోవాలి. నల్లగొండ రాజకీయాలను తనకంటి సైగలతో శాసించిన చకిలం శ్రీనివాసరావు దివంగతులై ఇప్పటికి 17 సంవత్సరాలు గడిచినప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చకిలం లాంటి దృఢమైన, బడుగు బలహీన వర్గాల నాయకుడు ఇప్పటి వరకు రాలేదు. కమ్యూనిస్టులకు బలంగా కంచుకోటలా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత మారుమూల గ్రామాల్లోనూ కాంగ్రెస్ పార్టీ జండాను ఎగురవేసి కార్యకర్తలకు భరోసా ఇచ్చిన నాయకుడు చకిలం.
అప్పట్లో బలమైన ప్రతిపక్షాలతో పాటు తన పార్టీలోని వైరి వర్గాలను ఎదిరించి జిల్లాలో శాసన సభ్యుడిగా, పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహించిన చకిలం శ్రీనివాసరావు మాజీ ప్రధానులైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతోపాటు పీవీ నరసింహ రావులకు అత్యంత ఆప్తులుగా ఉండి నేరుగా సంబంధాలు కలిగి ఉండేవారు. చకిలం మరణం వరకు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నిరాటకంగా పనిచేశారు. తప్పని పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వస్తే, తన ప్రధాన అనుచరులైన బలహీన వర్గాలకు చెందిన చొక్కళ్ళ బ్రాహ్మణాచారి, గర్దాసు బాలయ్యలను జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేశారు. తన హయాంలో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలలో మొదటి సారిగా జనరల్ స్థానాల్లో బలహీన వర్గాల వారికి టికెట్లిచ్చిన ఘనత ఆయనది.
నల్లగొండ జిల్లా ప్రజల్లో ఆయన ఎంతగా పెనవేసుకపోయారంటే, దూరంగా పని చేస్తున్న తనకు కోరిన చోటకు బదిలీ కావాల్సివస్తే ఉద్యోగికి….ఆయనే గుర్తొస్తారు. తన కొడుకుకు ఉద్యోగానికి ఇంటర్వ్యూ లెటర్ వస్తే…వారి దగ్గరికి పోయి ఫోన్ చేయించాల్సిందే..
ప్రత్యర్థి పార్టీల వాళ్ళు తమపై దాడులు చేస్తున్నారని అంటూ తన దగ్గరికి వచ్చిన వారికి పూర్తి స్థాయి భరోసా ఇవ్వడం ఆయన నైజం.. తనను నమ్ముకున్న వాళ్ళను గుండెలో పెట్టుకొని చూసుకొనేవారు..
అందుకే నల్లగొండ జిల్లా ప్రజలు, ఆయనలో అప్పటి యువత ఒక చేగువేరాను చూసుకున్నారు. తన పార్టీలోని ఫ్యూడల్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన స్పార్టకస్ లా ఆయనను చూసుకున్నారు కార్యకర్తలు. ఫ్యూడల్ కుల భావ జాలంపై సంధించిన వజ్రాయుధంగా బడుగు, బలహీనులు ఆయనను పోల్చుకున్నారు. అందుకే, చకిలం శ్రీనివాసరావుకు సర్దార్ అని బిరుదు నిచ్చారు. నల్లగొండ జిల్లానే కాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ చకిలం శ్రీనివాసరావుకు ప్రతీ జిల్లాలో అభిమానులు ఉన్నారు. చకిలం శత జయంతి సందర్బంగా ఆయనకివే మా స్మృత్యంజలి.