మాతృభాషపై మమకారం తగ్గొద్దు

ఎన్ని భాషలు నేర్చుకున్నా      మాతృభాషను మరవొద్దు

మాతృభాషపై మమకారం తగ్గొద్దు

నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి : తెలుగు భాష తియ్యదనం…అమ్మ వంట కమ్మదనం. ఎన్ని భాషలు నేర్చుకున్నా… మాతృభాష మాధుర్యాన్ని మరువొద్దు. భాష పట్ల మక్కువను చాటాలి. అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంధాలయ ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో పురాతన దేవరకొండ కోట ప్రాశస్త్యాన్ని తెలియజేసే “గాడ్స్ఓన్ ఫోర్ట్-లైఫ్ ఇన్ ఎ సెంచరీ”ఛాయాచిత్ర ప్రదర్శన ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ప్రముఖ కవి, రచయిత మామిడి హరికృష్ణ ప్రోత్సాహంతో, నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి పర్యవేక్షణలో, జర్నలిస్ట్ ఔత్సాహిక ఛాయాచిత్రకారుడు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రతినిధి యూనుస్ ఫర్హాన్ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ పట్టణ పురపాలక చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కొండల్ రావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రదర్శనను తిలకించిన ముఖ్య అతిధులు ప్రదర్శన ఏర్పాటుకు ప్రోత్సహించి సహకరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ప్రదర్శన నిర్వాహకుడు యూనుస్ ఫర్హాన్ లను అభినందించారు. అనంతరం గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ప్రపంచంలో అనేక భాషలున్నాయి. దేశంలో అనేక భాషలున్నాయి. మన దేశంలో ఎక్కువమంది హిందీ భాషలో మాట్లాడుతారు. హిందీభాష తర్వాత దేశంలో ఎక్కువమంది తెలుగు భాషలో మాట్లాడతారని చెప్పారు. ప్రపంచ దేశాల్లో భారతీయులే ఎక్కువగా ఆంగ్ల భాష మాట్లాడుతారని, ఆంగ్ల భాషను నేర్చుకోవడం వల్లనే భారతీయులు ప్రపంచంలోని అనేక దేశాల్లో శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగాల్లో పనిచేస్తూ ఆర్ధికంగా ఎదగడమేకాక దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకొస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎన్ని భాషలు మాట్లాడినా మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతం వారైనా తమ మాతృభాషను మరిచిపోవద్దని, అందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని నరేందర్ రెడ్డి తెలిపారు. నిత్యం మనం మననిత్యావసర పనులలో, విధుల నిర్వహణలో అనేకమందితో వివిధ భాషలలో సంప్రదింపులు జరుపుతున్నాము. అయితే మాతృభాషను, కన్నవారిని, పుట్టినఊరిని మరిచిపోవద్దని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఉద్బోధించారు. ఇంగ్లీషు భాషలో వెనుకబడడంవల్ల కాలేజీ రోజుల్లో అవమానాలు ఎదుర్కొన్నానని, మాతృభాషతోపాటు జీవితంలో ఎదగడానికి అవసరమైన భాషలు, ముఖ్యంగా ఆంగ్ల భాషను నేర్చుకోవాలని భూపాల్ రెడ్డి సూచించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు. వంద సంవత్సరాల దేవరకొండ కోట చరిత్రను కళ్లకుకట్టినట్లు తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శనను విద్యార్థులు, చరిత్రను తెలుసుకోవాలనుకునేవారు తిలకించాలని ఆయన సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి మాట్లాడుతూ తెలుగు భాషకు ముందు సంస్కృతం సహా ఇతర భాషాల్లో మాట్లాడుకునేవారం. కానీ మన పూర్వీకులు, నాటి పాలకులు, కవులు, కళాకారులు, రచయితలు తెలుగు భాశాభివృద్ధికి కృషిచేశారని చెప్పారు. తేనెలూరే తెలుగు భాష మధురమైందని అందుకే గురజాడ అప్పారావు “దేశభాషలందు తెలుగులెస్స” అని తెలుగుభాష గొప్పతనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారని భిక్షపతి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక ప్రతినిధి యూనుస్ ఫర్హాన్ స్వాగతం పలుకగా, గ్రంధాలయ సంస్థ సెక్రెటరీ వందన సమర్పణ చేశారు. ఎంఈఓ నర్సింహ, నాయకులు, కవులు, రచయితలు కటికం సత్తయ్య గౌడ్, అనురాధ రెడ్డి, చక్రహరి రామరాజు, అంబటి వెంకన్న, పున్న అంజయ్య, వనం చంద్రమౌళి, నర్సింహారెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 21, 22, 23 తేదీల్లో జరిగిన ఛాయాచిత్ర ప్రదర్శనను వేలాదిమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు సందర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking