మోడీ అండతోనే అధాని అందలం

మోడీ అండతోనే అధాని అందలం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

1980 చివర్లో ఒక సాధారణ వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించిన గౌతమ్ అదానీ గత ప్రభుత్వాల సహకారంతో ఎదిగి నేడు నరేంద్ర మోడీ సహాకారంతో ప్రపంచ కుబేరుల సరసన నిలిచాడని వీక్షణలు పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ అన్నారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన హిండెన్ బర్గ్ అద్దంలో అదానీ అక్రమాలు అనే అంశంపై విద్యావంతులు వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగసంస్థలను నిర్వీర్యం చేస్తూ డొల్ల కంపెనీల పేరుతో పెట్టుబడులు పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో ఉంచుకున్నారన్నారు. పిడికెడు మంది సంపన్నులకు దేశ సంపద దక్కేలా బడ్జెట్ రూపుదిద్దుకొంటుందన్నారు. ఏండ్లుగా దేశ ప్రజలు పెంచుకున్న ఎల్ఐసి లాంటి సంస్థ ఇవాళ అదానీ తాకిడికి కుదేలు అయిందని గ్యాంగ్ స్టార్ పెట్టుబడులు అధికం అయ్యాయన్నారు. హిండెన్ బర్గ్ ఎంతో లోతుగా పనిచేసి అదానీ కంపెనీ షెర్ల అప్రూవల్ గుజరాత్ కు చెందిన చార్టేడ్ అకౌంటెన్సీ చూసిందన్నారు. అందులో 23, 24 సంవత్సరాల వయస్సు కలిగి అప్పుడే సిఎ మొదలుపెట్టిన యువకులు దాని మీద సంతకం పెట్టారన్నారు. విదేశీ లావాదేవీలు నిర్వహించేటప్పడు దేశ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో మాత్రమే నిర్వహించాలన్నారు. అలాగే 12 లక్షల కోట్ల రూపాయలు విదేశాల నుంచి వస్తే వాటిని నియంత్రించాల్సిన సెబి లాంటి సంస్థ నోరు మెదపడం లేదన్నారు. అలాగే కంపెనీలో లావాదేవీలు పరస్పరం చేస్తారు కానీ ఇక్కడ లావాదేవీలు అదానీ అన్న వినోద్ అదానీ, తమ్ముడు రాజేష్ అదానీ మధ్య జరిగాయన్నారు . అంటే కంపెనీల షేర్లు, పెట్టుబడులు అన్ని అదానీ సొంత కుటుంబానికి చెందినవే కదా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పకుండా అదానీ అక్రమాలు వెలుగులోకి తేవడం అంటే దేశాన్ని మరల పరాయికరణ చేసేందుకు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు కుట్రలు పన్నుతున్నాయని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. అలాగే దేశంలో వలసవాద కాలం నుండి దళారీ పెట్టుబడి రాజ్యమేలుతోందన్నారు. నేడు క్రోనీ క్యాపిటలిజం చేతిలో దేశ వ్యవస్థ ఉందన్నారు. భారతదేశంలో స్వయం అభివృద్ధికి కావలసిన ఇంజనీరింగ్ కోర్సులో మెకానికల్, సివిల్ కోర్సులు లేవన్నారు. సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్ కోర్సులు అంతర్జాతీయ క్రోనీ క్యాపిటలిస్టుల కోసం అందిస్తున్నారన్నారు. ఆశ్రిత పెట్టుబడి కోరలు చాచి ఉందని, హిండెన్ బర్గ్ నివేదిక బయటకు వచ్చాక అదానీ 400 పైచిలుకు పేజీలతో ఒక పొంతన లేని సమాధానాలతో నివేదిక బహిర్గతం చేశారన్నారు. కానీ అది నామ మాత్రమని తేలిపోయిందన్నారు. నేడు అదానీయే కాకుండా దేశ సంపదను దోచుకుని అంతర్జాతీయ క్రోనీ క్యాపిటలిజం పెంచుకున్న చాలా మంది వరుస క్రమంలో బయటకు వస్తారని అదానీ ఆశ్రీతులైన నేటి మోడీ ప్రభుత్వంపై ప్రజలు తీర్పు ఇచ్చే సమయం అతి దగ్గరలోనే ఉందన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking