ఎగిసిపడిన గ్యాస్ ఆగ్రహ జ్వాలలు

మిర్యాలగూడలో ఎగిసిపడిన గ్యాస్ నిరసన జ్వాలలు
* పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్
* ‘బీజేపీ హఠావో…దేశ్ కో బచావో’ అంటూ నినందించిన ప్రజాప్రతినిధులు, మహిళలు
* రోడ్డుపై నిర్వహించిన నిరసన, ‘వంటా-వార్పు’ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సర్కార్ ను వ్యతిరేకిస్తూ ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ‘బీజేపీ హఠావో…దేశ్ కో బచావో’ అంటూ ప్లకార్డులు చేబూని నినదించారు.

మిర్యాలగూడ పట్టణంలోని చౌరస్తాలన్నీ దద్దరిల్లాయి. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రధాన రోడ్డుపై నిర్వహించిన నిరసన, వంటావార్పు కార్యక్రమాల్లో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు. పేద ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసిందన్నారు. అడ్డగోలుగా గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. తరుచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో మంట రేపుతున్నదని విమర్శించారు. డొమెస్టిక్ సిలిండర్ పై రూ. 50 చొప్పున, కమర్షియల్ సిలిండర్ పై రూ. 350 చొప్పున పెంచడం దారుణమైన చర్య అని విమర్శించారు.

రెండు లక్షల 14 వేల కోట్ల రూపాయలను యూపీఏ ప్రభుత్వం హయాంలో సబ్సిడీ కింద ఇచ్చారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం 37,209 కోట్ల సబ్సిడీ ఇస్తుందంటే ఎంత తగ్గించిందనేది అర్థమవుతుందన్నారు. 2019 లో 37,209 కోట్ల సబ్సిడీ ఉంటే, 2023 లో 180 కోట్లకు తగ్గించిందన్నారు. 2014 లో బీజీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద 350 సబ్సిడీ ఉండే, క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు సున్నా చేశారనే విషయాన్ని భాస్కర్ రావు గుర్తు చేశారు. దేశంలో వాణిజ్య సిలిండర్‌ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి అని అన్నారు. నాడు గ్యాస్ ధరలు 400 ఉంటే అప్పటి బీజీపీ నేతలు గగ్గోలు పెట్టారు. స్మృతి ఇరానీ గ్యాస్ బండ తో రోడ్ల మీద ధర్నా చేసింది. ఇప్పుడు అదే స్మృతి ఇరాని కేంద్ర మంత్రిగా ఉంది. బీజీపీ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఒకవైపు పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచి సామాన్యుడి ప్రయాణాన్ని భారంగా మార్చిన మోడీ ప్రభుత్వం.. మరోవైపు వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలను పెంచుతూ జేబులు గుల్ల అయ్యే దుస్థితిని తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. 2014లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.410.50 ఉంటే.. తాజా పెంపుతో ఏకంగా రూ.1,155కు చేరింది. తొమ్మిదేండ్లలో కేవలం డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరనే రూ.744.50 పెంచింది. అంటే దాదాపు 178 శాతం పెరిగిందన్నమాట. ఎన్నిక‌లు అయిపోన ప్రతి సారి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంచ‌డం మోడీ సర్కారు కు అనవాయితీగా మారిందని విమర్శించారు.మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో ఎన్నికలు అలా అయిపోయాయో లేదో మళ్ళీ ధర పెంచారని విమర్శించారు.త్వరలో కర్ణాటక ఎన్నికలు వస్తున్నాయి, అవి అయిపోగానే మళ్ళీ పెంచుతారని అన్నారు. అంటే ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెబుతారు… ఎన్నికలు కాగానే అడ్డగోలుగా ధరలను పెంచుతారని భాస్కర్ రావు విమర్శించారు. ఎన్నికలు రాగానే 10 పైసలు తగ్గించి ఎన్నికలు అయిపోగానే 100 రూపాయలు పెంచుతున్నాడు ప్రధాని మోడీ…బీజేపీ పాలనలో ప్రజల తలసరి ఆదాయం డబుల్ కూడా కాలేదు కానీ, సిలిండర్ ధర మాత్రం మూడు రెట్లు పెరిగిందని అన్నారు. బీజేపీ అచ్చే దిన్ అంటే గిట్ల ఉంటది…మీ పాలన అచ్చే దిన్ కాదు, మీ ధరల పెరుగుదల చూసి సామాన్యుడు భయపడి రోజు సచ్చేదిన్ అవుతున్నదని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించేంత వరకు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని మోడీ సర్కారు ను భాస్కర్ రావు హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking