ఆమె….దుఃఖాన్ని దిగమింగి

 

ఆమెకు దాడులు, అత్యాచారం, హత్యలే మణిహారం!

*ఆమె వ్యక్తిత్వం గురించి ఏమని వర్ణించను.. ఎంతని రాయను… ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ఆమె లక్షణం. అన్నింట్లో రాణించే విలక్షణం. ఆమె ప్రకృతి సృష్టించిన అందం.. సమాజంలో ఆదర్శంగా నిలిచే ఓ నిలువుటద్దం. అష్టలక్ష్మిలకు రూపం.. సహనం, ఓర్పు, త్యాగానికి ప్రతిరూపం. దుఃఖం దిగమింగి ప్రేమ, ఆప్యాయత పంచడం ఆమె సొంతం.. మనసు విరిగిందో ఎంతకైనా తెగించే పంతం. ఇంత అందంగా వర్ణించడమంటే కేవలం ఆమెకు మాత్రమే సొంతం.*

*అణచివేయబడ్డ వర్గాల్లో…*

ప్రపంచ చరిత్ర పుటలు తిరిగేస్తే మహిళలకంటూ చాలా ప్రత్యేకత ఉంది. వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, రాజకీయ, తదితర అంశాల్లో ఎంతో ప్రముఖ స్థానం ఉంది. అందుకు గల తగిన ఆధారాలు లేకపోలేవు. అమ్మలా, గురువుగా, భార్యలా, తోబుట్టువులా అండదండై నిలుస్తుంది. స్వాతంత్ర్య పోరాటంలో, సామాజిక సేవలో తానై నిలిచింది. సైకిల్ తొక్కడం మొదలుకొని రాకెట్ నడపడం వరకు.. అటెండర్ నుంచి శాస్త్రవేత్త, న్యాయవాది, వ్యోమగామి వరకు రాణిస్తున్నారు. కుటుంబ సంరక్షణ, దేశ నిర్మాణం వరకు అన్నింట్లో సర్వశక్తిమంతులు. మగవాళ్ల ప్రతి పనుల్లో వాళ్ల అండదండలతో పురుషులు మరింత ముందుకు సాగుతున్నారు. ఇంత గొప్పతనం గల మహిళా మణులు నాటి నుంచి నేటి వరకు సమాజంలో ఎక్కడో ఒకచోట, ఏదో రూపంలో అణచివేత, దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలకు బలవుతున్నారు. ఇంట్లో, పనిచోట, సమాజంలో మానసిక, శారీరిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అడుగడుగునా అవమానం, అసమానతలు ఎదుర్కొంటున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి కాటికి కాలుజాపిన ముదుసలి దాకా, ఎక్కువగా అణిచివేయబడ్డ వర్గాల్లోని మహిళలు ఎన్నో ఆటుపోట్లు చవిచూస్తున్నారు.

 

*తెలిసిన వ్యక్తులే…*

ఇలాంటి ఘటనల్లో బాలికలు, యువతుల, మహిళలపై వారికి తెలిసిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పరిచయం, బంధుత్వం, స్నేహం వంటివి అడ్డుపెట్టుకుని మోసం చేస్తున్నారు. ప్రేమను కాదన్నారని, కోరిక తీర్చలేదని, పెళ్లికి అంగీకరించలేదని యాసిడ్ దాడి, అనుమానంతో వారిని హత్య చేస్తున్నారు. మద్యానికి బానిసై మత్తులో భార్య, పిల్లలను హింసిస్తున్నారు. రాత్రీ, పగలు తేడా లేకుండా ఇంట్లోంచి గెంటేస్తున్నారు. వైద్యం ముసుగులో యువతుల, మహిళల్ని కొందరు డాక్టర్ లు లోబరుచుకుంటున్నారు. ఈ బాధితుల్లో సామాన్యులు, ప్రసిద్ధ ప్రముఖులూ ఉన్నారు.

*నిర్భయ, గౌరీ లంకేశ్, దిశ ఘటన…*

2012 డిసెంబర్​ 16న దిల్లీలో నిర్భయ అత్యాచారం, తెలంగాణలో షాద్‌నగర్‌ సమీపంలో 2019లో దిశపై అత్యాచారం, సజీవదహనం ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కర్ణాటకలో మావోయిస్టు, మతోన్మాద సంబంధిత వార్తలు, సామాజిక అంశాలపై చురుకుగా స్పందించే ప్రముఖ మహిళా జర్నలిస్టు, సామాజికవేత్త గౌరీ లంకేశ్‌ ను 2017లో దారుణంగా కాల్చి హత్య చేశారు. పాతకక్షలు, కుటుంబ కలహాలతో ఇటీవలే ఫిబ్రవరిలో యాదాద్రి జిల్లా వెల్లంకిలో ఓ జర్నలిస్టు తల్లి(60)పై అదే ఊరికి చెందిన వ్యక్తి కుటుంబం బూతుపురాణంతో దౌర్జన్యంగా, వివస్త్రను చేసి ఇబ్బందులకు గురి చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఝార్ఖండ్ లోని లాహోర్ దగా జిల్లాలో మైనర్లు అయిన ఇద్దరు చెల్లెళ్లపై సొంత అన్న గత ఏప్రిల్ లో అత్యాచారం చేశాడు. జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా ఇటీవలే పదవి చేపట్టిన సినీ నటి కుష్బూ.. మహిళలపై జరుగుతున్న దాడులపై తాజాగా స్పందించారు. తానూ లైంగిక వేధింపులకు గురైనట్లు, 8ఏళ్ల వయసులో సొంత తండ్రి నుంచే ఇలాంటివి ఎదుర్కున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో కులాంతర వివాహం చేసుకున్న ఓ యువతిని ఆమె సామాజిక వర్గం చితకబాది గుండు కొట్టించారు. సాక్షాత్తు ఇటువంటి దుర్భర ఘటనలే ఆమెకు మణిహారంగా మారుతున్నాయి.


డ్రగ్స్ మద్యం వల్లే ఎక్కువ

మన తెలుగు నేల ఏపీలో మహిళలపై గత మూడేళ్లలో దాడులు పెరిగాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. మూడేళ్లలో 22 వేల 278 మంది తప్పిపోయినట్లు వెల్లడైంది. అదేవిధంగా అత్యాచారాలు 9.39 శాతం పెరిగినట్లు గతేడాది డిసెంబర్ లో పేర్కొంది. భారత్​లో 2019లో రోజుకు సగటున 87 అత్యాచారాలు జరిగాయని, అత్యధిక దాడులు మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో జరిగినట్లు జాతీయ నేర గణాంక నమోదు సంస్థ(ఎన్‌ఆర్‌సీబీ) లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి దురదృష్టకర ఘటనలు భవిష్యత్తులో జరగవచ్చని ఆనాడు ప్రముఖులైన షేక్ ఫాతిమా, సావిత్రిబాయి పూలే, రమాబాయి అంబేద్కర్ లాంటివారు మహిళా విద్య, సాధికారత, వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. స్త్రీ సంక్షేమం కోసం స్వర్వం జీవితాలు అర్పించారు. జోగిని వ్యవస్థపై మహా కవి గుఱ్ఱం జాషువా కూతురు హేమలత లవణం ఎన్నో పోరాటాలు చేసింది. మహిళల కోసం పాటుపడే వారిని, సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వం గుర్తించి మహిళా దినోత్సవం సందర్భంగా తగిన గుర్తింపునిచ్చి గౌరవించాలి. అయితే ఎవరెన్ని చేసినా, ఎన్ని చట్టాలు తెచ్చినా స్త్రీల పట్ల మనుషులు, సమాజం వారి ఆలోచన, ప్రవర్తన తీరు మర్చుకున్నప్పుడు మాత్రమే ఆమెపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టవచ్చు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

(మార్చి 8) పురస్కరించుకొని

 ప్రత్యేక వ్యాసo

 

                 తలారి గణేష్
       జర్నలిస్టు, సామాజిక కార్యకర్త

Leave A Reply

Your email address will not be published.

Breaking