విద్యార్థులు నవసమాజ నిర్మాతలు
* దేశ ఉజ్వల భవిష్యత్తు నిర్దేశకులు
* అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు
* 18 ఏండ్లుగా విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు హమీద్ షేక్ నిర్వర్తిస్తున్న కృషి అభినందనీయం
* విజేతలకు జ్ఞాపికలు, పతకాలు అందజేత : నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నాయకులు షేక్ మధార్ బాబా
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
విద్యార్థులు నవ సమాజ నిర్మాతలని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నాయకులు షేక్ మధార్ బాబా కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రఖ్యాత స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ పట్టణ స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానంలో పి.ఆశ్రిత (అభ్యాస్ టెక్నో స్కూల్), ద్వితీయ స్థానంలో కె.ఐశ్వర్య (ఆదిత్య హై స్కూల్), తృతీయ స్థానంలో డి.సృజన (కైరళి స్కూల్), చిత్రలేఖనంలో పోటీలో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ కు చెందిన షేక్ సాలెహా ఫర్నాజ్ ప్రథమ స్థానంలో, నేతాజీ హై స్కూల్ కు చెందిన ఎన్. మహేష్ ద్వితీయ స్థానంలో నిలిచారు.
శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలకు షేక్ మధార్ బాబా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు, విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీ పరీక్షలు దోహదపడతాయని అన్నారు. లేఖనా నైపుణ్యాలను పదునుపెట్టేందుకు వ్యాసరచన పోటీలు, చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు చిత్రలేఖనం పోటీలు ఉపయుక్తమవుతాయని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని, పలు రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా సాధికారతే లక్ష్యంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా నిర్వహిస్తోందన్నారు. గత 18 ఏండ్లుగా ప్రతిభావంతులైన విద్యార్థులను వెలికితీయాలనే ధృడ సంకల్పంతో జిల్లా,డివిజన్, పట్టణ స్థాయిల్లో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ ను షేక్ మధార్ బాబా
అభినందించారు.
అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలను, పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి శ్రీనివాస్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.