మిర్యాలగూడ డివిజన్ లో
స్వల్ప వర్షం….భారీ ఉరుములు, పిడుగులు
*ఒక ఇల్లు దగ్ధం, ఒక వ్యక్తి, 20 మేకలు మృతి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : అకాల వర్షం మిర్యాలగూడను ఉక్కిరి బిక్కిరి చేసింది. స్వల్ప వర్షమే పడినప్పటికీ ఉరుములు, మెరుపులు రావడంతో పిడుగులు పడ్డాయి. మిర్యాలగూడ పట్టణంలోని ఓ ఇంటిపై పిడుగు పడి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ పరిధిలో గురువారం సాయంత్రం భారీ ఉరుములు, మెరుపులతో స్వల్ప వర్షం పడగా, పిడుగుపాటుకు ఒక ఇల్లు దగ్ధం, ఒక వ్యక్తి, సుమారు 20 గొర్రెలు మేకలు చనిపోయాయి.
మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలో గంటా శ్రవణ్ రెడ్డి ఇంటిలో పిడుగుపాటుకు షార్ట్ సర్క్యూట్ జరిగి ఫర్నిచర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ సామాగ్రి, దుస్తులు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ప్రాణం నష్టం తప్పిందని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 9 నుండి పది లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని సంఘటన స్థలాన్ని సందర్శించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. ప్రభుత్వం సాధ్యమైన సహాయాన్నందిస్తానన్నారు. తహసిల్దార్, ఆర్ఐలు జరిగిన నష్టాన్ని అంచనా వేయమని ఆదేశించానని ఆర్డీఓ బి.చెన్నయ్య అన్నారు. నిబంధనల ప్రకారం సహాయమందిస్తామని ఆయన అన్నారు. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపిపి నూకల హన్మంతరెడ్డి, డిఎస్పి వెంకటగిరి, ఒన్ టౌన్ సిఐ రాఘవేందర్ లు పరిశీలించారు. అదేవిధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం చింతల తండాలో పిడుగు పాటుకు సుమారు 20 గొర్రెలు, మేకలు, ఒక వ్యక్తి మరణించారు.