నిరంకుశంపై అంకుశం

నిరంకుశంపై అంకుశం
* పెత్తందారీ వ్యవస్థపై తిరగబడ్డ విప్లవ వీరుడు
* నేడు దొడ్డి కొంరయ్య 96వ జయంతి
* తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి
* అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతి

భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన పోరాటంలో పెత్తందారీ వ్యవస్థపై తిరగబడిన విప్లవ వీరుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదట రక్తం చిందించి, ఉద్యమానికి నెత్తుటి తిలకం దిద్ది వీరమరణం పొందాడు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో, నాటికి నేటికీ పీడిత ప్రజల గుండెల్లో వీరపుత్రుడిగా నిలిచాడు కడవెండి దొడ్డి కొంరయ్య. నేడు ఆయన 96వ జయంతి సందర్భంగా కథనం..

భూమ్మీద నివసించే ప్రతి మనిషి స్వేచ్ఛను, బతుకును కోరుకుంటాడు. తన స్వేచ్ఛను బతుకును ఎవరైనా దోపిడీ చేస్తే తిరగబడతాడు. అలా తిరగబడడమే మార్పునకు సంకేతం. మార్పు అంటే విప్లవం. ప్రపంచ చరిత్రలో స్వేచ్ఛ కోసం ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. ఒక్కో ఉద్యమానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అన్నిటికంటే భిన్నంగా ఏర్పడిన ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ప్రజలు తమ కడుపులో రగులుతున్న మంటను అగ్నికీలలై భూస్వాములు, పెత్తందారీ వ్యవస్థపై కురిపించారు. భూమి, భుక్తి, పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన ఉద్యమంలో ఎంతోమంది అసువులుబాసారు. 4వేల మందికి పైగా ప్రాణాలర్పించిన ఈ పోరాటంలో మొట్టమొదలు రక్తం చిందించి, ఉద్యమానికి నెత్తుటి తిలకం దిద్ది వీరమరణం పొందిన కడవెండి దొడ్డి కొంరయ్య ప్రపంచ ఉద్యమాల చరిత్రలో, నాటికి నేటికీ పీడిత ప్రజల గుండెల్లో వీరపుత్రుడే.

దొడ్డి కొంరయ్య జయంతి నేడు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో నైజాం రజాకార్ల తూటాలకు బలైన తొలి అమరుడు దొడ్డి కొంరయ్య జయంతి నేడు. అతని 96వ జయంతి వేడుకలను స్వగ్రామం కడవెండిలో సోమవారం నిర్వహించనున్నారు. ఒక్క కడవెండే కాదు ప్రపంచ కార్మిక, కర్షక, పీడిత వర్గాలు ఇతని జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. కడవెండిలో దొడ్డి కొండయ్య- గట్టమ్మ దంపతులకు 1924 ఏప్రిల్‌ 3న నాలుగవ సంతానంగా జన్మించాడు. గ్రామానికి ఆంధ్ర మహాసభ రావడానికి కీలక భూమిక వహించిన వ్యక్తుల్లో ఒకరైన దొడ్డి మల్లయ్యకు స్వయాన తమ్ముడు కొంరయ్య. అన్న మల్లయ్య సంఘ నాయకుడిగా గ్రామంలో జరిగే ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు. చిన్నప్పటి నుంచే గ్రామంలో జరిగే గొడవలను గమనిస్తున్న కొంరయ్య అన్నను అనుసరిస్తూ ఆంధ్రమహాసభలో చురుకైన కార్యకర్తగా పనిచేశాడు.

దొరల అరాచకాలు, అణచివేతలు కొంరయ్య అసంతృప్తి, ఆవేశాలు కట్టలు తెంచుకునేలా చేసి అతన్ని కరుడుగట్టిన కమ్యూనిస్టుగా మార్చాయి. 1945 జూలై 4న కడవెండి ఆంధ్రమహాసభ నాయకుడు ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్ల నర్సింహులుతో పాటు మరికొందరిని హత్య చేయాలని రజాకార్‌ మిస్కినలీ, దేశ్‌ముఖ్‌ అనుచరులు కుట్ర పన్నారు. గ్రామంలో అలజడి సృష్టించారు. ఈ విషయం గ్రహించిన స్థానిక ఆంధ్ర మహాసభ నాయకులు గుంపుగా వారిని ఎదిరించేందుకు సమాయత్తమయ్యారు. వంద మందికి పైగా దొరకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బొడ్రాయి వద్దకు చేరారు. ముందు వరుసలో గుతుపలు పట్టుకుని దొడ్డిమల్లయ్య, దొడ్డి కొంరయ్య నిలిచారు. సైన్యం వలె తరలివస్తున్న వీరిని చూసిన కుట్రదారులు తుపాకులతో విరుచుకుపడ్డారు. మొదటి తూటా దొడ్డి మల్లయ్య కాళ్ల వైపు దూసుకుపోగా తన అన్నపై తూటాలు పేల్చుతారా అని గూండాలపైకి దూసుకెళ్లిన కొంరయ్యపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ తూటాలు కొంరయ్య పొట్టలోకి దూసుకుపోయి పేగులు బయటికి వచ్చాయి. ఆవేశం ఆగని కొంరయ్య పేగులను కడుపులోకి తోస్తూ నినాదాలు చేస్తూ వీరమరణం పొందాడు. ఈ కాల్పుల్లో తూటాల రవ్వలు రేషపల్లి కొండయ్య, రేషపల్లి లక్ష్మీనర్సయ్య తలలకు తగిలి రక్తస్రావమైంది.

బానిసత్వం, వెట్టినుంచి పుట్టిన ఉద్యమం
నిజాం పాలనలో పాత జనగామ తాలూకాలో భూములన్నీ పెత్తందార్ల చేతుల్లో ఉండగా, వారి ఆగడాలకు అదుపులేని రోజులవి. కులవృత్తుల వాళ్లు వారిళ్ల్లలో వెట్టిచేయడం, బానిసలుగా ఊడిగం చేయడం నుంచి ఈ పోరాటం పుట్టింది. విసునూరు రాంచంద్రారెడ్డి తల్లి జానమ్మ కడవెండిలో స్థిర నివాసం ఏర్పర్చుకొని వ్యవసాయాన్ని గ్రామస్తులతో తరతరాలుగా ఉచితంగా చేయించుకునేది. ఈ అరాచకాలను విసిగిన జనం వారిలో కోపం కట్టలు తెంచుకోవడంతో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటుకు ఆంధ్ర మహాసభ తోడవడంతో గ్రామంలో గుతుపల సంఘాలు ఏర్పడి పెత్తందార్లపై యుద్ధం ప్రకటించేస్ధాయికి చేరింది. ఇదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరుగా మారి ఉధృతమైంది. అన్ని గ్రామాలకు విస్తరించిన సాయుధ పోరు దొడ్డి కొంరయ్య అమరత్వంలో ఉగ్రరూపం దాల్చి పెత్తందార్లు అంతరించే వరకు కొనసాగింది.

కొంరయ్య అమరత్వం చరిత్రాత్మకం
మా చిన్నాన్న కొంరయ్య అమరత్వం చరిత్రలో నిలిచిపోయింది. మా కుటుంబానికి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన కొంరయ్య చిరస్మరణీయుడు. అతని వారసత్వం గ్రామంలో ఉద్యమాలకు మరో పునాది వేసింది. అనేకమంది పలు ఉద్యమాల్లో అసువులుబాసి కొంరయ్య వారసత్వాన్ని కొనసాగించారు. మా నాన్న మల్లయ్య అడుగుజాడల్లో నడిచి, తెలంగాణ సాయుధ పోరులో పాల్గొన్న కొంరయ్య మృతితో మా కుటుంబం చలించిపోయింది. ఇక తెలంగాణ ప్రభుత్వం దొడ్డి కొంరయ్య జయంతి, వర్ధంతిలను అధికారికంగా చేస్తామని హామీ ఇవ్వడం సంతోషకర విషయం. దొడ్డి కొంరయ్య విగ్రహం, ట్యాంకుబండ్‌పై పెట్టి, అతని పేర హైదరాబాద్‌లో స్మారక భవనాన్ని ప్రభుత్వం కట్టాలనేది మా అందరి కోరిక. దొడ్డి కొంరయ్య విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అందించారు. జూలైలో దొడ్డి కొంరయ్య వర్ధంతి వేళ ఆవిష్కరిస్తారు.

– దొడ్డి భిక్షపతి

దొడ్డి కొంరయ్య వారసుడు, కడవెండి

Leave A Reply

Your email address will not be published.

Breaking