తాగునీటి కష్టాలు షురూ… * కిన్నెరసాని నీటి పథకం అస్తవ్యస్తం * ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్ * ఇబ్బందుల్లో ప్రజలు * పట్టించుకోని మున్సిపల్ అధికారులు
తాగునీటి కష్టాలు షురూ…
* కిన్నెరసాని నీటి పథకం అస్తవ్యస్తం
* ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్
* ఇబ్బందుల్లో ప్రజలు
* పట్టించుకోని మున్సిపల్ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వేసవి ఆరంభానికి ముందే తాగునీటి కటకట తీవ్రమవుతోంది. గుక్కెడు మంచినీరు కోసం జనం నానాపాట్లు పడుతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా నీటి సమస్య జటిలమవుతోంది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇంతకాలం గొంతు తడిపిన చేతిపంపులు కూడా వట్టిపోతున్నాయి. బావుల్లో నీరు ఆవిరైపోయింది. వేసవి ఆరంభంలోనే పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక ఏప్రిల్, మే మాసాల్లో నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం కిన్నెరసాని పథకాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆ పథకం సరిగ్గా నీరు అందించలేక పోతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులు ఉండగా వీటికి కిన్నెరసాని నీటి సరఫరా కావలసి ఉంది. గత ఆరు రోజులుగా కిన్నెరసాని నీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం ప్రారంభం కావడం నీటి ఎద్దడి నెలకొనడంతో మహిళా మణులు ఆందోళన చెందుతున్నారు.

కిన్నెరసాని నీటి సరఫరాలోపాలపై వివిధ పార్టీలు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. తాజాగా బుధవారం భద్రాద్రి జిల్లా కేంద్రంలోని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కిన్నెరసాని నీటి సరఫరా అస్తవ్యస్తంపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ నేత ఎర్ర కామేష్ మాట్లాడుతూ నీటి సరఫరా సమస్యను పరిష్కరించలేని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కిన్నెరసాని నీటి సరఫరా సరిగ్గా జరగాకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు కూడా కిన్నెరసాని పథకంపై సరిగ్గా ఫోకస్ పెట్టకపోవడం వల్లనే సమస్య ఎదురవుతుందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కిన్నెరసాని నీళ్లు ప్రతిరోజు వార్డులకు సరఫరా అయ్యేవిధంగా ఏ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.