అమిత్‌షా వ్యాఖ్యలు సరికావు -ముస్లిం మైనార్టీ ప్రజల్లో అభద్రతాభావం – సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

అమిత్‌షా వ్యాఖ్యలు సరికావు

-ముస్లిం మైనార్టీ ప్రజల్లో అభద్రతాభావం

– సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం/అక్షిత బ్యూరో :

తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బిజెపి అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు సంకుచిత రాజకీయాలకు నిదర్శనమని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.ముస్లిం మైనార్టీ ప్రజల్లో అభద్రతా భావం పెంపొందేలా మాట్లాడటం దేశ విస్తృత ప్రయోజనాలను దెబ్బ తీస్తుందన్న విషయాన్ని గ్రహించాలని కోరారు. ముస్లింలు ఈ దేశ పౌరులేనని ముస్లిం జనాభాలో చాలామంది అత్యంత నిరుపేదలని చాలా దుర్భర జీవనం కొనసాగిస్తున్నారని ఎస్సీ ఎస్టీ బిసిల మాదిరిగానే వారికి కూడా రాజ్యాంగం వారి సంక్షేమానికి అభివృద్ధి చెందడానికి రిజర్వేషన్లు కల్పించిందని రాజ్యాంగబద్దంగా వారికి కల్పించిన రిజర్వేషన్లను రద్దుచేస్తామని బహిరంగంగా ప్రకటన చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నున్నా తన ప్రకటనలో తెలిపారు.మొదటి నుండి బిజెపి ఆరెస్సెస్‌ శక్తులు రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు రద్దుచేసి వాటిని ఎస్సీ ఎస్టీ బిసి లకు అందచేస్తామని ప్రగల్బాలు మాట్లాడటం విడ్డూరమని అన్నారు. రాజ్యాంగాన్నే మార్చివేసి రిజర్వేషన్లు ఎత్తివేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని జన గణనలో కుల గణన చేయాలని కులాల వారి లెక్కలు తీయాలని అలా తీస్తే బిసి కులాల మధ్య వున్న వ్యత్యాసాలను తొలగించడానికి వీలవుతుందని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా చేయడం లేదని విమర్శించారు.నిజంగా బిజెపికి ఓబిసిలపై ప్రేమ వుంటే బిసి రిజర్వేషన్లపై వున్న 50% సీలింగ్‌ ఎత్తివేయాలని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్ని అప్పనంగా అదాని అంబాని లాంటి కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతూ దేశ సంపదను దోచి పెడుతుందని మండిపడ్డారు.బిజెపి ప్రభుత్వం ప్రజలను నయవంచన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బిజెపి ఇలాంటి ప్రకటనలు చేయకుండా ప్రజల మధ్య చిచ్చు పెట్టే చర్యలు మానుకోవాలని నున్నా తన ప్రకటనలో కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking