సీఎం కప్ క్రీడల సందడి

 

నేడు ఎల్‌బి స్టేడియంలో

ప్రారంభోత్సవ వేడుకలు
———————————-

* ఉత్సాహంగా మొదలైన సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలు
* సందడిగా ‘సాట్స్‌’ మైదానాలు
* అట్టహాసంగా ఆరంభ వేడుకలకు అన్ని ఏర్పాట్లు
* ముఖ్య అతిథిగా కేటీఆర్‌

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

గ్రామీణ యువతకు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్‌) ద్వారా నిర్వహిస్తున్న సీఎం కప్‌ ` 2023 రాష్ట్రస్థాయి పోటీలు ఈరోజు మొదలయ్యాయి.

హైదరాబాద్‌ నగరంలోని 6 స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో జరుగుతున్న ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 వేలకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరంతా శనివారం రాత్రి హైదరాబాద్‌ నగరానికి చేరుకోగా, వారందరికీ భోజనం, వసతి మరియు రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండే విధంగా సాట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, క్రీడల శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సాట్స్‌ ఓఎస్‌డి డా॥ కె. లక్ష్మీలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

మొత్తం 18 క్రీడాంశాల్లో జిఎంసి బాలయోగి స్టేడియం గచ్చిబౌలిలో అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, స్విమ్మింగ్‌, హాకీ పోటీలు నిర్వహిస్తుండగా, ఎల్‌బి స్టేడియంలో హ్యాండ్‌బాల్‌, లాన్‌ టెన్నిస్‌, బాక్సింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు జరుగుతున్నాయి. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో వాలీబాల్‌, జిమ్నాస్టిక్స్‌, కబడ్డీ పోటీలు జరుగుతుండగా, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియం యూసుఫ్‌ గూడలో బాస్కెట్‌ బాల్‌, రెజ్లింగ్‌, జింఖానా గ్రౌండ్‌లో ఖో-ఖో, షూటింగ్‌ రేంజ్‌లో షూటింగ్‌ పోటీలు జరగనున్నాయి. ఆయా స్టేడియాల్లో ఈరోజు ఉదయం 8:30 నుంచి పోటీలు ప్రారంభమైనాయి. మధ్యాహ్నం విరామ అనంతరం సాయంత్రం కూడా పోటీలు జరిగాయి.

 

అట్టహాసంగా ఆరంభ వేడుకలు
రేపు సాయంత్రం ఐదు గంటలకు ఎల్‌బి స్టేడియంలో సీఎం కప్‌ ` 2023 రాష్ట్రస్థాయి పోటీల వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. గౌరవ క్రీడా శాఖ మంత్రివర్యులు డాక్టర్‌ వి .శ్రీనివాస్‌ గౌడ్‌ అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కె. తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాలతో పాటు పద్మశ్రీ, ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీతలు, వివిధ క్రీడారంగా, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు అతిథులుగా హాజరు కానున్నారు. 33 జిల్లాల నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో ‘మార్చీ ఫస్ట్‌’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సమన్వయంతో అబ్బుర పరిచే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత సంగీత విభావరి రాహుల్‌ సిప్లిగంజ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

వివిధ స్టేడియాల నుండి ప్రారంభ వేడుకలకు తరలివచ్చే క్రీడాకారులకు రవాణా సదుపాయము, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్‌ బాటిల్స్‌, స్నాక్స్‌ను అందజేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మహిళా క్రీడాకారులు తరలివచ్చే బస్సులో ప్రతి బస్సులో ఒక మహిళా పోలీస్‌ లేదా హోంగార్డును ఉండే విధంగా ఏర్పాటు చేశారు. వివిధ సబ్‌ కమిటీలు ఆయా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన తదుపరి క్రీడాకారులు తిరిగి వారి వారి వసతి కేంద్రాలకు తరలిపోయే వరకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking