అడుగు పెట్టకముందే అపశృతి!
పార్లమెంట్ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి నేడు అంకితం చేసే కార్యక్రమం ప్రధాని చేతుల మీదుగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీని మీద అనేక వర్గాలు ఆందోళన చేయటం, ఈ వేడుకకు విపక్షాలు వెళ్లగూడదని నిర్ణయించటమూ తెలిసిందే. భిన్న భాషలు, భావజాలం, సంస్కృతి, సంప్రదాయాలతో విలసిల్లుతున్న ఈ సువిశాల భరతభూమిలో.. వీటన్నిటినీ ఒకే తాటి మీదకు తెచ్చి ఐక్యత రాగాన్ని ఆలపించే వేదికగా భాసిల్లుతున్నది మన పార్లమెంటు. అటువంటి పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం అన్ని పక్షాలూ కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన వేడుక. కానీ, అది వివాదాస్పదమవటం దురదృష్టకరం!
నూతన పార్లమెంటు భవన ప్రారంభ వేడుకకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆహ్వానాలు పంపించింది. అయితే, ఇంతటి మహత్తర కార్యక్రమంలో రాజ్యసభ ప్రమేయం లేకపోవటం ఆశ్చర్యం. ఈ నూతన పార్లమెంటు భవనంలో రాజ్యసభ చాంబరు, రాజ్యసభ చైర్మన్ కార్యాలయం ఉంటాయిగదా! మరి రాజ్యసభను ఎందుకు భాగస్వామిని చెయ్యలేదో అర్థం కావడం లేదు.
రాజ్యాంగంలోని 79వ అధికరణం నిర్దేశించినట్లు, మన పార్లమెంటు మూడు విభాగాలుగా ఉంటుంది. అది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభలతో కూడినది. అంటే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం అన్నమాట. అందువల్లనే, ఉభయ సభలు ఓ బిల్లును ఆమోదించినా రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే అది చట్టంగా రూపుదిద్దుకుంటుం ది. ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది అని అప్పుడు అనుకోవాలి. అయితే, చాలామందికి పెద్దగా తెలియని విషయమేమిటంటే పార్లమెంటు ప్రాంగణంలో ప్రధానికి ప్రత్యేక స్థానం అంటూ ఏమీ లేదు. అందరు పార్లమెంటు సభ్యులలాగే ప్రధాని గూడా ఒక సభ్యుడు (సభ్యుడు కాకుండాగూడా ఓ ఆరు నెలలు మంత్రిగానో, ప్రధానిగానో కొనసాగే వెసులుబాటు మన రాజ్యాంగం కల్పించింది. అది వేరే విషయం). అందరు మంత్రుల్లాగే ప్రధానికి ఒక గది ఉంటుంది. సభ్యుడైతే తాను సభ్యుడైన సభకి నాయకుడు (leader of the house)గా వ్యవహరిస్తారు. అంతకు మించి ప్రధానికి పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేకత ఏమీ లేదు. పార్లమెంటు ప్రాంగణం అంతా లోక్‌సభ స్పీకరు ఆధ్వర్యంలో ఉంటుంది.
స్పీకరుని పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని కలవాలంటే, ప్రధానే స్పీకరు గదికి వెళ్తారుగానీ స్పీకరు ప్రధాని గదికి రారు. అది స్పీకరుకి పార్లమెంటులో అత్యున్నత గౌరవం యిచ్చే ఒక మంచి పార్లమెంటరీ సంప్రదాయం. దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే, పార్లమెంటరీ వ్యవస్థలోగానీ, పార్లమెంటు ప్రాంగణంలోగానీ ప్రధానికి ప్రత్యేక స్థానం ఏదీ లేదని. నూతన పార్లమెంటు భవన ప్రారంభ వేడుకకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఆహ్వానాలు పంపించింది. అయితే, ఇంతటి మహత్తర కార్యక్రమంలో రాజ్యసభ ప్రమేయం లేకపోవటం ఆశ్చర్యం. ఈ నూతన పార్లమెంటు భవనంలో రాజ్యసభ చాంబరు, రాజ్యసభ చైర్మన్ కార్యాలయం ఉంటాయిగదా! మరి రాజ్యసభను ఎందుకు భాగస్వామిని చెయ్యలేదో అర్థం కావడం లేదు.
పార్లమెంటు అంటే లోక్‌సభ ఒక్కటే కాదు గదా! పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రెండు సభలూ. అటువంటప్పుడు నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం ప్రధాని చేతుల మీదగా జరగటం ఏమిటన్న ప్రశ్న అందరి మదినీ తొలుస్తున్నది.
పార్లమెంటులో అంతర్భాగమైన రాష్ట్రపతిని విస్మరించి ప్రధాని చేతుల మీదగా ఈ వేడుక జరగటం రాజకీయాలతో సంబంధం లేని చాలామంది దేశ పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా, ఈ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన గూడా ప్రధాని చేతుల మీదగానే జరిగింది. ఇదే ఒక విడ్డూరమైతే నూతన భవనం ప్రారంభోత్సవంకూడా ఆయన చేతుల మీదే జరగటం మరో విడ్డూరం. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? 2014 వరకు మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. తరువాత ప్రధానమంత్రిత్వ ప్రజాస్వామ్యంగా అవతరించాం. ఈ కొత్త వ్యవస్థ అంతా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ నూతన ఒరవడిలో వ్యవస్థ ముఖ్యంగాదు వ్యవస్థను నడిపే వ్యక్తే ముఖ్యం. మన స్వతంత్ర సమరయోధులుగానీ, రాజ్యాంగ సృష్టికర్తలుగానీ దీనిపై ఆలోచన చెయ్యలేదు, ఈ పరిస్థితి వస్తుందని వూహించనూ లేదు.
కొంతమంది ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే అంటున్నారు. ఇది సాంకేతికంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం కిందకి రాకపోవచ్చు. ఎందుకంటే భూమి పూజ, శంకుస్థాప న, ప్రారంభోత్సవం ఇత్యాది కార్యకలాపాలను ఏవిధంగా నిర్వహించాలనేది ఏ రాజ్యాంగ మూ చర్చించదు. ఇది పెద్ద మనుషులు పెద్ద మనసుతో నిర్ణయించవలసిన విషయం. మన కు స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రోటోకాల్ ప్రకారం మొదట రాష్ట్రపతి, తరువాత ప్రధాని, మూడవ స్థానంలో ఉప రాష్ట్రపతి ఉండేవారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన మేధస్సును గౌరవిస్తూ ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి తరువాత ఉప రాష్ట్రపతి, మూడో స్థానంలో ప్రధాని ఉండేలా మార్పులు చేశారు నాటి ప్రధాని నెహ్రూ. అదీ పెద్ద మనసు అంటే. దీని వలన నెహ్రూ తన ప్రాధాన్యతను ఏ విధంగానూ కోల్పోలేదు.
మన వ్యవస్థలో రాష్ట్రపతి జాతికి ప్రథమ పౌరుడు, దేశాధినేత, సర్వసైన్యాధిపతి, రాజ్యాంగ రక్షకుడు. అంతేకాదు, ఇందాక అనుకున్నట్లు రాష్ట్రపతి పార్లమెంటుతో విడదీయరాని అంతర్భాగం. మరి అటువంటి రాష్ట్రపతి పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ వేడుకను అందరిలాగే టీవీలో చూడవలసిరావటం అతిపెద్ద విడ్డూరం.
ఈ వేడుకకు ముందుగానే రాష్ట్రపతికి నూతన భవనం విశేషాలను తెలుపుతూ ఒక ప్రత్యేకమైన సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేయవలసింది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి నూతన భవనంలో ప్రసంగించాల్సి వచ్చినప్పుడు, నూతన పార్లమెంటు భవనాన్ని దేశాధినేత అదే మొదటిసారి చూస్తారు అనుకుంటుంటే, ఆ ఆలోచనే ఎంతో ఎబ్బెట్టుగా వుంది. ఇది వ్యవస్థా పూర్వకమైన కోణం. ఒకసారి వ్యక్తిగత కోణంలో కూడా పరిశీలించుదాం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ఆదివాసీ మహిళను అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవికి ఎన్నుకున్నామని దేశమంతా గర్వించింది. ఆ మధురస్మృతి ఇంకా పదిలంగానే వుంది. మరి ఒక గిరిపుత్రికను రాష్ట్రపతిగా ఎన్నుకున్న మనం ఆమెకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇదేనా భారతీయ సంప్రదాయం? ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి? ఇదేనా ప్రజాస్వామ్య విలువలకు మనమిచ్చే గౌరవం? ఇదేనా మహిళలపట్ల మనం చూపే అభిమానం? ఇవన్నీ నేడు సగటు మనిషిని వేధిస్తున్న ప్రశ్నలు.
జవహర్‌లాల్ నెహ్రూ చెట్టంత మనిషి. అనంతరం వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి నిప్పులాంటి నిబద్ధత కల నేత. ఆ తరువాత వచ్చిన ఇందిరాగాంధీ ఒక ధీర వనిత. తదనంతరం వచ్చిన మొరార్జీ దేశాయి మసకబారిన ప్రజాస్వామ్యాన్ని కాపాడిన నేత. ఆ తరువాత వచ్చిన రాజీవ్ గాంధీ, వీపీ సింగ్, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటివారు వ్యవస్థను బలోపేతం చెయ్యటానికి తమ వంతు కృషి చేశారు. మధ్యలో వచ్చిన దేవెగౌడ, గుజ్రాల్ వంటి ప్రధానులు కూడా వ్యవస్థలో ఒదిగి పని చేశారుగాని, వ్యవస్థని వంచాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. వ్యవస్థలను వంచటం అనేది 2014 నుంచి మొదలైంది. 2004 నుంచి 2014 వరకు అడ్డూ అదుపు లేని అవినీతి పాలనతో విసిగి వేసారిన దేశ ప్రజలు, 2014 నుంచి జరుగుతున్న అప్రజాస్వామిక తంతును పెద్దగా గమనించలేదు. 2014 నుంచి నేటి వరకు సాంకేతిక కారణాలతో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను ఏ పార్టీకి ఇవ్వకపోవటం ఒకటైతే, 2019 నుంచి నేటి వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకరు పదవిని భర్తీ చేయకపోవటం మరొక విడ్డూరం. రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయకపోవటం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇది నాలుగేండ్లుగా జరుగుతున్నా మీడియా ఎప్పుడైనా పట్టించుకుందా? మేధావులు ఏనాడైనా అడిగారా? మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్దలు ఊరకే అనలేదు. అసలు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అన్న నినాదమే ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటిక. దాన్ని ఎవరూ గమనించలేదు!
పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ వివాదంలో జోక్యం చేసుకోవటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గృహప్రవేశ వేడుకలు మన సంతోషం కొద్దీ సంస్కృతీ సంప్రదాయాలతో జరుపుకొనే ముచ్చట. ఇది కోర్టు ఆదేశాలతో జరుపుకోలేము. నేడు జరుగుతున్న పొరపాటును సమర్థించుకోవటానికి గతంలో జరిగిన సంఘటనలను ఉదాహరణగా చూపుతున్నారు.
ఒక పొరపాటు మరొక పొరపాటుకు ప్రేరణ అవ్వాలా? కారణమవ్వాలా? రేపు మరో తప్పు చేసేవారు నేడు జరిగిన తప్పిదాన్ని ఒక ఉదాహరణగా చూపించటమేనా మనం భవిష్యత్తు తరాలకు వారసత్వంగా ఇచ్చే దిశానిర్దేశం? ఇది చాల దురదృష్టకర పరిణామం. ఇలా జరగకూడదు. అసలు, ఈ ఉదంతంలో రాష్ట్రపతి గారు ఏమనుకుంటున్నారు, ఏ విధమైన అంతర్మథనం చెందుతున్నారో తెలుసుకునే అవకాశం మనకు లేదు. ఇదంతా ముగిసిన తర్వాత రాష్ట్రపతి గారు దీర్ఘంగా ఆలోచించుకోవాలి, గౌరవం లేని చోట ఉండాలా వద్దా అనేది. కానీ, ఇది అన్నంత తేలిక కాదు. మన రాష్ట్రపతులు ఎన్నడూ వివాదాల్ని సృష్టించలేదు, వాటిలో తలదూర్చలేదు. అది వ్యవస్థ గొప్పదనం. ఈ గొప్పతనాన్ని కాపాడుకునే గురుతర బాధ్యత అందరిపైనా ఉంది.