సబ్బండ వర్గాల ప్రగతి లక్ష్యం
దశాబ్ది సుపరిపాలన ప్రగతి
బండా నరేందర్ రెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలకు ప్రభుత్వం పాలనను మరింత చేరువ చేసినందున నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం అని జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యోగులకు అత్యధిక పిఆర్సి ప్రకటించింది అన్నారు. పెంచిన పి ఆర్ సి గురించి గ్రామ గ్రామాన చర్చ జరిగి ఉద్యోగులకే అన్ని ఇస్తారు అని మా సంగతి ఏంది అని చర్చించుకున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతుబంధు పథకం ప్రకటించి అందరిని సంతోషంలో ముంచెత్తారని ఆయన తెలిపారు. అదే విధంగా అన్ని వర్గాల ప్రజలు లబ్ది పొందేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. జిల్లాలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలని అన్నారు. గతంలో ఉమ్మడి నల్లగొండ కలిసి ఉన్నప్పుడు ప్రజలు తమ సమస్యలు అధికారులను కలిసి దరఖాస్తు సమర్పించాలంటే 150 నుండి 200 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ నేడు ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడం వలన అన్ని జిల్లా కేంద్రాలు 40 నుండి 50 కిలోమీటర్ల లోపే దూరం ఉన్నాయని ఆయన తెలిపారు. జిల్లా పరిపాలనలో భాగంగా కొత్త మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి పరిపాలన చేరువ చేశామని ఆయన అన్నారు. గ్రామాలలో పరిపాలన సౌలభ్యం కోసం గ్రామపంచాయతీ బిల్డింగులను నిర్మించామని ఆయన తెలిపారు.

రెవెన్యూ వ్యవస్థలో *ధరణి* పోర్టల్ తీసుకువచ్చి భూ సమస్యల పరిష్కారాన్ని కృషి చేసినది ఈ ప్రభుత్వం అన్నారు. గతంలో భూమి ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ కబ్జాలో ఒకరు ఉండి సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అనేక అవస్థలు పడ్డారని ఆయన తెలిపారు. ధరణి ద్వారా ఒకసారి భూమి రిజిస్ట్రేషన్ పూర్తి గా ఆన్లైన్లో నమోదు అయితే వారే హక్కుదారులుగా పరిగణిస్తారని ఆయన తెలిపారు. ధరణి విషయంలో కొంతమంది పనిగట్టుకొని రుష్పచారం చేస్తున్నారని దీనిని అధికారులు, ఉద్యోగులు ప్రజలకు అవగాహన కలిగించాలని ఆయన కోరారు. జిల్లాలో 93% భూములు కరెక్టుగా నమోదు అయ్యాయని కేవలం 7 శాతం మాత్రం సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. భూమి కౌలుకు ఇస్తే హాక్కుదారులు కారని, వ్యవసాయం చేయని వారు భూమి పడావు ఉండకుండా తాత్కాలికంగా కౌలుకు ఇస్తారని ఆయన తెలిపారు. జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ పథకాలను గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ కు, అధికార యంత్రంగానికి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, ఇది ఉద్యోగుల ప్రభుత్వం అన్నారు. ఉద్యోగులకు ప్రజాప్రతినిధులు అండగా ఉండాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెడ్ల బండి మాదిరిగా కలిసి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లాలో 12,000 మంది ఉద్యోగులు ఉన్నారని ఆయన వివరించారు. అప్పటి హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి తో కలిసి ఈ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని అప్పటి విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు సుపరిపాలన అందరి ఉద్యోగుల వల్లనే సాధ్యమవుతుంది అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, అందులో ఉద్యోగుల బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా ఉంటారని ఆయన తెలిపారు. మీరు 30 సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేస్తారు. కానీ మేము ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి గెలిచినా ఓడిన ప్రజాసేవలోనే ఉంటామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని మరోసారి గుర్తు చేశారు.
నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు పరిపాలన సంస్కరణలో తెచ్చి జవాబు దారితనాన్ని ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. దశ దిశను తెలంగాణకు ముందే ఊహించిన కేసీఆర్ కు ఉద్యమంలో ధైర్యాన్ని ఇచ్చింది ఉద్యోగస్తులు అని అన్నారు. కేసీఆర్ తో పాటు అడుగులు వేసింది ఆనాడు ఉద్యోగులు, అధికారులు అన్నారు. దేశ చరిత్రలోనే మిలియన్ మార్చ్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించాం అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగులు, అధికారులు ముఖ్యం అన్నారు. దేశ చరిత్రలోనే మిలియన్ మార్చ్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించాం అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగిల పాత్ర కీలకం అన్నారు. రైతాంగం అభివృద్ధికి కరెంటు, నీళ్ల కష్టం తీరిందన్నారు. సంక్షేమము, పాలనాపరమైన అంశాలలో అధికారుల వికేంద్రీకరణలో మార్పులు తెచ్చి అభివృద్ధి ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేశామన్నారు. ఉద్యోగులకు జీతాలు పెంచి, వాహనాలు అందించి, ఆఫీసులు కూడా కార్పొరేట్ ఆఫీసుల తరహాలో తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల అధికారులు శాఖల వారీగా పోటీపడి నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఇంకా చేయాల్సిన పనులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ పునర్ నిర్మాణానికి ఉద్యోగులు, అధికారులు సహకరించాలని ఆయన కోరారు.
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండగకు విశేష స్పందన వచ్చిందన్నారు. కార్యక్రమాలలో భాగంగా వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ, విద్యుత్తు, సంక్షేమ శాఖలు అందించిన సేవలు, గణాంకాలు ప్రజలకు వివరించి అవగాహన కలిగించామని ఆయన తెలిపారు. నల్లగొండ ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలుగా చేయడం వలన పరిపాలన వికేంద్రీకరణ జరిగిందన్నారు. అదే విధంగా నల్లగొండలో ఆరు కొత్త మండలాలు, 5 మున్సిపాలిటీలు, 342 గ్రామపంచాయతీలు, 104 ప్రత్యేక గిరిజన గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామని ఆయన వివరించారు. అలాగే రాష్ట్రం మొత్తం 33 జిల్లాలుగా విభజించారని ఆయన తెలిపారు. రెవెన్యూ, పోలీస్, స్థానిక సంస్థలలో భాగంగా కొత్తగా అనేక కార్యాలయాలను స్థాపించుకున్నామని ఆయన తెలిపారు. ఇరిగేషన్ శాఖను మొత్తం ఒకే గొడుకు కిందుకు తీసుకువచ్చారని ఆయన తెలిపారు. అదే విధంగా ఆర్ అండ్ బి శాఖ ను కూడా సంస్కరించడం జరిగిందని ఆయన అన్నారు. పరిపాలనలో భాగంగా ధరణి, బి పాస్, టీఎస్ ఐపాస్ అనేవి చాలా మంచి సేవలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్లో స్లాట్లు బుక్ చేసి తాసిల్దార్ కార్యాలయంలో వెంటనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కాగానే మ్యుటేషన్ గతంలో ప్రత్యేకంగా చేసేవారన్నారు. కానీ నేడు రిజిస్ట్రేషన్ తో పాటే ముటేషన్ కూడా ఏకకాలంలో చేస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో పాసుపుస్తకం, టైటిల్ డిడ్ ఉండేవి కానీ నేడు రెండు కలిపి ఒకే పుస్తకంలో అందిస్తున్నామని ఆయన తెలిపారు. ధరణి ద్వారా భూ సమస్యలు ఉంటే పరిష్కారానికి అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. నేడు భూ సమస్యలు తగ్గి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని మన రాష్ట్రానికి అనేక కంపెనీలు, సంస్థలు, పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. టీఎస్ బి పాస్ ద్వారా బిల్డింగ్ పర్మిషన్లు ఆన్లైన్లో వెంటనే ఇస్తున్నామన్నారు. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. దళిత బంధు ద్వారా ఆర్థిక వనరులను సృష్టించి పది లక్షల రూపాయల ద్వారా ఉపాధి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. సంక్షేమం కింద గతంలో బ్యాంకులో ఆర్థిక సహాయం మంజూరీకి అనేక ఇబ్బందులు ఉండేది కానీ నేడు అలా కాకుండా ప్రభుత్వమే నేరుగా ఆర్థిక సాయం లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, తదితరులు,ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.