కోట సరితకు జాతీయ నంది అవార్డు
అవార్డు గ్రహీత సరితకు అభినందనలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
విద్యా, క్రీడా, సామాజిక, సేవా రంగాల్లో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయిని కోట సరిత తెలుగు వెలుగు సాహితీ వేదిక నుంచి జాతీయ నంది అవార్డు అందుకుంది. ఎంతో మంది విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ఇంపాక్ట్ ట్రైనింగ్ ట్రైనర్ గా విశిష్ఠ సేవలందిస్తోంది. ఎన్నో సామాజిక అంశాల పట్ల అవగాహనను కల్పిస్తూ చైతన్య వంతులను చేస్తుంది. నల్గొండ జిల్లా చండూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పిస్తూ వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తూ బంగారు భవితకు బాటలు వేస్తుంది. విద్యారంగంలో విశిష్ఠ సేవలందిస్తున్న కోట సరిత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకొని ఉన్నతాధికారుల ప్రశంసలందుకొంది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై టీచర్స్ యూనియన్ లోనూ క్రియాశీలక భూమిక పోషిస్తుంది. అదే స్ఫూర్తి… ఒరవడితో క్రీడా రంగంలోనూ తమదైన శైలిలో క్యారమ్ జాతీయ క్రీడాకారిణిగా వెలుగొందుతుంది. సామాజిక అంశాల పట్ల గురుతర బాధ్యతను కలిగి ఉండి లయన్స్ క్లబ్ నుంచి విశిష్ఠ సేవలందిస్తుంది. విద్యా, క్రీడా, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న కోట సరితకు గుంటూరులో తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ నంది అవార్డును అందించి సత్కరించింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా, జాతీయ నంది అవార్డు గ్రహీతగా పురస్కారం అందుకున్న కోట సరితను పలువురు అభినందించారు. ఇంకనూ మరిన్ని సేవలందించి మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.