మైనారిటీల సంక్షేమానికి
సీఎం కేసీఆర్ కృషి
* మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 39 మందికి మంజూరైన రూ.50 లక్షల విలువైన చెక్కులు పంపిణి
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 39 మందికి మంజూరైన రూ.50 లక్షల విలువైన చెక్కులను టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డితో కలిసి భాస్కర్ రావు పంపిణి చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మైనారిటీ పిల్లల కోసం అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లిం యువతుల పెండ్లి కోసం షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తోందన్నారు. మైనారిటీస్ ఓవర్ సీస్ పథకం ద్వారా ముస్లిం యువత విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను మంజూరు చేస్తోందన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలను మంజూరు చేస్తున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం కారణంగా అనేక మంది మైనారిటీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడించారని పేర్కొన్నారు. మసీదుల్లో దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న ఇమామ్ లకు, మౌజమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తున్నదని అన్నారు.
ఇమామ్ లకు నెలకు రూ.9,997, మౌజమ్ లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. మైనారిటీల అభ్యున్నతితో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తోందని భాస్కర్ రావు తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయంలో సగం కూడా దేశానిది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తోందని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. కేంద్రం బలహీనంగా ఉంటే రాష్ట్రం కూడా బలహీనంగానే వుంటుంది. ఏ పరిస్థితుల కారణంగానైనా కేంద్రంలో గడబిడ ఉంటే కచ్చితంగా దానిని ఆపాలి.దానిని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనదేనని భాస్కర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల పక్షపాతి అని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీలు నూకల సరళ హన్మంత్ రెడ్డి, పోకల శ్రీవిద్య రాజు, డీసీఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మైనారిటీ నాయకులు యూసుఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, పాక్స్ చైర్మన్లు వెలిశెట్టి రామకృష్ణ, జెర్రిపోతుల రాములు గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇంఛార్జీలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.