రేవంత్‌పై భగ్గుమన్న రైతన్న

ఉచితాలు వద్దంటున్న రేవంత్‌ కి రైతులే తగిన బుద్ధి చెప్పాలి
* రేవంత్‌పై భగ్గుమన్న రైతన్న
* మిర్యాలగూడలో భారీ ర్యాలీ
* టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై తీవ్ర నిరసన, దిష్టి బొమ్మ దహనం
* ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు. రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. రేవంత్‌ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు ఆయన చిత్రపటానికి పిండ ప్రదానం చేశారు. రేవంత్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంటే, చంద్రబాబు మాదిరిగా కాంగ్రెస్‌ నేతలు దండుగ అంటున్నారని మండిపడ్డారు.

ఉచితాలు వద్దంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి రైతులే తగిన బుద్ధి చెప్పాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న రైతు వేదిక భవనం నుంచి రాజీవ్ చౌక్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రాజీవ్ చౌక్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను భాస్కర్ రావు దహనం చేశారు. రేవంత్ దొంగ.. డౌన్ డౌన్ రేవంత్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. అనంతరం ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడారు. రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక 3గంటల కరెంట్ వస్తుందని, మళ్లీ పాతరోజులు వస్తాయన్నారు. రైతులు, వ్యవసాయం గురించి రేవంత్‌ రెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే రైతులు తమకు అనుకూలమైన సమయంలో పొలాలకు నీళ్లు పారించుకుంటున్నారని తెలిపారు. ఒక పక్క బీజేపీ రైతుల మోటర్లుకు మీటర్లు పెట్టాలంటోంది. మరోవైపు కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దు అంటోంది. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్ హయాంలో రాత్రి కరెంట్ వల్ల కరెంట్ షాక్ లు, పాము కాట్లతో రైతులు చనిపోయిన ఘటనలు అనేక ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దళారుల కోసం, బీజేపీ పార్టీ ఆదాని, అంబానీ కోసం పనిచేస్తే కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు. రైతుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని భాస్కర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ పాత చీకటి రోజులు వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉచిత విద్యుత్తు వద్దంటున్న రేవంత్‌.. పింఛన్లు ఎలా పెంచుతారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల తీర్పుతో రేవంత్‌కు, కాంగ్రెస్‌కు చెంపచెళ్లుమనాలని సూచించారు. రైతులను అవమానించిన రేవంత్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి 3 గంట లు సరిపోతుందనటం ఆయన అహంకారానికి నిదర్శనమని భాస్కర్ రావు మండిపడ్డారు.రైతుబీమా, ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌ నేతల దుర్నీతిని రైతాంగం ఖండించాలని పిలుపునిచ్చారు. అమెరికా వెళ్లి.. మన రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ దిష్టిబొమ్మలను రైతులు దహనం చేయాలని కోరారు. చంద్రబాబు కూడా నాడు ఉచిత కరెంటు కోసం రైతులను పొట్టన పెట్టుకున్నాడని, ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు అలాంటి కూతలే కూస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్‌ నాయకులు.. సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చ బడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు వద్దన్న కాంగ్రెస్‌ నేతలకు ఎన్నికల్లో కరెంట్‌ షాక్‌ ఇవ్వాలి అని రైతులకు విజ్ఞప్తి చేశారు.రైతు ఉన్నతికి సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు తదితర పథకాలు ప్రవేశపెడితే.. వడ్ల కొనుగోలులో రాజకీయం, వడ్లు తడిస్తే రాజకీయం, తడిసిన వడ్లు కొంటే రాజకీయం, కొన్న వడ్లకు పైసలు ఇచ్చే కాడ రాజకీయం చేసేది కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలేనని ధ్వజమెత్తారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సరార్‌ అంటూ రైతుల తరుపున నినదిస్తున్న ఏకైక నేత కేసీఆర్‌ అని భాస్కర్ రావు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, రైతు బంధు సమితి మండల అద్యక్షులు గడగోజు ఏడుకొండలు, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇంఛార్జీలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking