నమ్మినోళ్ళకు నట్టేట?
అత్యాశకు వెళ్తే… అసలుకెసరు !
అరవై రోజుల్లో రెండింతలు!!
ఎంత కడితే అంతకు డబుల్ !!!
ఓ సంస్థ నయా దందా
ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు
పక్షం రోజుల్లోనే పాతిక కోట్లు సేకరణ
ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి :
అత్యాశకు వెళ్తే… అసలుకెసరొచ్చినట్లుంది. ఎంత కడితే అంతకు డబుల్.అరవై రోజుల్లోనే మీ పెట్టుబడికి రెండింతలు. నమ్మండి…ఇది నిజం. మాది పెద్ద కంపెనీ… మీ పెట్టుబడికి మాది భరోసా. నమ్మకం లేకుంటే మా కంపెనీ ప్లాట్లు మీ పెట్టుబడికి తగిన స్థలం… మీ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎలాంటి డోకా లేదు… ఆయా సొమ్మును మేము వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి అత్యధిక లాభాలు సాధిస్తాం… అందులో నుంచే మీ సొమ్ముకు రెండింతలిస్తాం. ‘రూ.15 లక్షలు పెట్టండి. రెండు నెలల్లోనే డబుల్ చేసిస్తాం. రూ.30 లక్షలు మీ చేతిలో పెడతాం. అడ్వాన్స్ చెక్కులు, ప్రామిసరీ నోట్, బాండ్ పేపరు రాసిస్తాం. నమ్మకం. లేదా? అయితే నాలుగు నెలల్లో డబుల్ చేస్తాం. దానికి గాను గుంట భూమిని రిజిస్ట్రేషన్ చేసిస్తాం. అమౌంట్ ఇవ్వగానే మా భూమి మాకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయండి. చాలా పెద్ద కంపెనీ ఇది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలోనూ మా బ్రాంచిలున్నాయి. విజయవాడ,బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోనూ ఆఫీసులు ఉన్నాయి. కంపెనీ మీద నమ్మకం లేకపోతే చెప్పండి. రెండు నెలల్లో 50 శాతం అదనంగా ఇస్తాం. దానికి మా సొంత చెక్కులు ఇస్తాం. ఇది అందరికీ కాదు. మమ్మల్ని నమ్మినోళ్లకే. విశ్వాసముంటేనే పెట్టుబడి పెట్టండి.’ అంటూ అమాయక జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. రెండు నెలల్లోనే డబుల్ అవుతాయంటే చాలా మంది పెట్టబడులు పెడుతున్నారు. ఇందులో ప్రభుత్వ టీచర్లు, ప్రైవేటు ఉద్యోగులు, రైతులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇలా అనేక రంగాలకు చెందిన వారు పెట్టుబడులు పెట్టేస్తుండ్రు. అక్కడి మేనేజర్లు, మధ్యవర్తుల వివరాల ప్రకారం ఈ కంపెనీ పక్షం రోజుల్లోనే రూ.25 కోట్లకు పైగానే కలెక్షన్ చేసింది. హైదరాబాద్ నగరంలోని సాగర్ రింగ్ రోడ్డుకు చేరువలో వెలసిన ఆఫీసులో అత్యంత గోప్యంగా ఈ దందా మూడు పువ్వులు ఆరు కాసులుగా విరాజిల్లుతుంది. అయితే అదెలా సాధ్యమని ప్రశ్నించేవాళ్లకు మాత్రం స్కీంలో చోటు లేదు. ఇక జనం జాతరను తలపించేలా నోట్ల కట్టలు తెచ్చి కట్టేస్తుండ్రు.చాలా మంది బంగారాన్ని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి వచ్చిన సొమ్మును ఈ కంపెనీలో పెట్టినట్లు సమాచారం. ఇంకొందరైతే బంధుమిత్రుల దగ్గర వడ్డీకి తెచ్చారు. మరికొందరేమో తన వాళ్లందరితో రెట్టింపు డబ్బులొస్తా యంటూ నమ్మించారు. జూన్ 11 నుంచి ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నది. రెండు నెలల్లోనే డబుల్ పేమెంట్ స్కీం గురించి సమాచారం గుప్పుమంది. అమాయక రైతులకు రెండిoతల ఎర చూపి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురం, మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్ల కింద ప్రభుత్వం వేలాది ఎకరాలను సేకరించింది. రైతులకు నష్టపరిహారం ఇచ్చింది. ఆ వచ్చిన సొమ్ముతో పోయిన భూమిలో 25 శాతం కూడా రాదు. దాంతో ఆ వచ్చిన డబ్బులన్నీ ఖాతాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా వీళ్లనే టార్గెట్ చేసుకొని డబుల్ చేసి ఇస్తామంటూ కొందరు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆక్కడి స్థానికులనే ఏజెంట్లుగా సెలెక్ట్ చేశారు. వారి మీద నమ్మకంతో చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు క్యూ కడుతున్నారు. ఈ రెండు మండలాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలకు చెందిన అనేక మంది ఆశపడ్డారు. టీచర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక మంది పెట్టుబడి పెట్టారు. అయితే రెండు నెలల తర్వాత మొదటి దఫా కట్టిన వారికి డబుల్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ తర్వాత కట్టిన వారికి డబుల్ పేమెంట్ రావడం కష్టమే. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే ఒకరి నుంచి మరొకరు తెలుసుకొని ఈ స్కీంలో పెట్టుబడి పెట్టడానికి ఆఫీసులోకి డబ్బుల కట్టలతో వస్తున్నారు. పెట్టుబడి పెట్టిన ఓ మిత్రుడు సలహా మేరకు ఈ స్కీం వివరాలపై ఆరా తీశాం. కార్యాలయంలోకి వెళ్ళగానే జన జాతరను తలపించింది. ఆశావహులు డబ్బుల కట్టలు టేబుల్ మీద పోస్తూనే ఉన్నారు. అక్కడ కూర్చున్న వారితో మాట్లాడితే తాము ఒక్కొక్కరం రూ.15 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టామన్నారు. తమకు తెలిసిన వారితో రూ. కోటికి పైగానే పెట్టించినట్లు వివరించారు. రెండు నెలల్లోనే డబుల్ వస్తున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు.. మీరు కూడా పెట్టండన్నారు. రూ.2, 3 లక్షలు పెడితే వేస్ట్. కనీసం రూ.10, 15 లక్షలు పెడితే బాగుంటుందని కితాబ్. స్కీం వివరాలన్నీ చెప్పారు. రెండు నెలల్లో డబుల్ ఇస్తాం. నమ్మకం లేకపోతే గుంట భూమిని రిజిస్ట్రేషన్ చేసి నాలుగు నెలల్లో ఇస్తాం. తిరిగి కంపెనీకి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ స్కీం నాలుగు నెలల నుంచి ఆర్నెళ్లకు త్వరలో పెంచేస్తాం. మేం అనుకున్న అమౌంట్ వచ్చేసింది. ఇప్పటికే రూ.25 కోట్లకు పైగానే కలెక్ట్ అయ్యింది. మర్రిగూడ మండలానికి చెందిన వారమని, అనేక రకాల వ్యాపారాలను కొనసాగిస్తాం. లాభాలు వస్తాయి. అందులో నుంచే పెట్టుబడి పెట్టిన వారికి ఇస్తాం. నమ్మకం ఉంటేనే పెట్టండి. కంపెనీని నమ్మకపోతే నన్ను నమ్మండి. నాకే డబ్బులు ఇవ్వండి. నా సొంత చెక్కులు ఇస్తా. అయితే నేనైతే నాలుగు నెలల్లో డబుల్ ఇస్తామని పెట్టుబడి పెట్టిన అతను చెప్పారు. అమాయక జనానికి అత్యాశ చూపించి డబ్బులు ఎగరేసుకుపోతారనే సందేహం లేదు. తొలి రోజుల్లో పెట్టిన వారికి ఇస్తుండొచ్చు. కానీ ఆ తర్వాత కట్టిన వారి గతి ఏం కావాలి? ఒక్కొక్కరు జీవితాన్ని ఫణంగా పెట్టి డబ్బులు తెచ్చి కట్టారు. రూ.లక్షకు రూ.10 వేల కమీషన్ కి కక్కుర్తి పడిన ఏజెంట్లు సొంతూర్లలోనే జనంతో డబ్బులు కట్టించారు. ఇందులో ఓ సర్పంచ్ కూడా రూ.15 లక్షలు కట్టడంతో జనం నమ్ముతున్నారు. ఎప్పుడు దుకాణం సర్దేస్తారో ?అంతుచిక్కడం లేదు. నాంపల్లి, మర్రిగూడ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు పెట్టుబడి పెట్టారు. అత్యాశ.. అమాయక జనం ఉన్నంత వరకు వివిధ రూపాల్లో దందాలు రాజ్యమేలుతాయి. ఆశకు కూడా హద్దుండాలి గదా! ఇదెలా సాధ్యం? ఇంత డబ్బు ఎలా ఇస్తారు? 2 నెలలో రెండింతలు ఎలా వస్తుంది? అనే ఆలోచనలు లేకుండా లక్షలకు లక్షలు తెచ్చి టేబుల్ పై పోస్తుండడo విశేషం. ఆ నోటా ఈ నోటా పాకి విస్తృత ప్రచారం సాగడం… కోట్లాది రూపాయలు వసూలు కావడం జరిగింది. వీరికి రెండింతలు అటుంచి కట్టిన డబ్బైనా చేతి కందుతుందో? లేదో? వేచి చూడాల్సిందే.