పెద్ద వాగుకు పెద్దోడి కన్నం

పెద్ద వాగుకు పెద్దోడి కన్నం

వాగు భూమిని వదలని నేత

దర్జాగా భూ కబ్జా
కట్టలు కట్టి సాగుకు ఉపక్రమించి

మునుగోడు, అక్షిత ప్రతినిధి :

పేదోడు గజం జరిగితే పెద్ద గగ్గోలు. పెద్దోడు ఎకరాలకు ఎకరాలకు కన్నం వేసినా నోరు మెదపరు. కల్గినోనికి అన్ని కలిసొస్తయ్. అంగ, అర్ద, ఆర్థిక, సామజిక, రాజకీయ పలుకుబడి తోడవుతాయ్. కంచె చేను మేసేలా ఉంది ఈ వాగు ఆక్రమణ తంతు. మును”గోడు” వాగు గోడు ఇలా ఉంది. చట్టాన్ని పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధి ఏకంగా చట్టాన్ని చుట్టంగా చేసుకొని అధికారులను మచ్చిక చేసుకొని వాగును దర్జాగా కబ్జా చేశాడు. వివరాల్లోకి వెళ్తే…
మునుగోడు మండల కేంద్రంలో భూ ఆక్రమణ జోరుగా సాగుతున్నాయన్న అపవాదు ఉంది. అధికారుల చర్యలు అక్రమార్కుల ముందు చెల్లడం లేదు. కొన్ని సంవత్సరాలుగా వాగు భూములు ఆక్రమించుకొని పంటలు సాగు చేస్తున్న అధికారులు పంట్టించుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాగు భూమి అక్రమణకు గురౌతుందని చుట్టు పక్కల రైతులు అధికారుల దృష్ఠికి తీసుకపోయిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.

దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల సహకారంతోనే కబ్జాదారులు అందినంత భూమిని ఆక్రమిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ భూములు, కుంటలు, వాగులు, వంకలు కనిపిస్తే చాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి చేరాల్సిందే. ప్రజలకు సేవ చేస్తాం ఎల్లప్పుడు మీకు అండగా ఉంటామని హామి ఇచ్చి అధికారంలోకి రాగానే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. ఏకంగా వాగు భూములకే ఎసరు పెడుతున్నారు. ఎంతో కొంత పట్టా ఉంటే చాలు దానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని ఎకరాలకు ఎకరాలు అక్రమించుకొని సాగుచేసుకుంటున్నారు. మరికొందరూ అక్కడ పట్టా లేకున్నా సరే ఎకరాలనే అక్రమించుకోని సాగుచేసుకుంటున్న వైనం. సామాన్యుడు నివాసం ఉండడానికి ఒక్క గుంట భూమిని కూడా ఆక్రమించుకోలేకపోతున్నారు. అక్రమదారులు మాత్రం వాగు భూములకు కన్నం వేసి సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్ఠి సారించి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. మునుగోడు గ్రామ శివారులోని చౌటుప్పల్ రహదారిలోని కార్తీకేయ కాటన్ మిల్లు సమీపంలో ఉన్న పెద్దవాగు భూమి కబ్జాకు గురైందని పలువురు వాపోతున్నారు. ఓ ప్రజాప్రతినిధి మునుగోడు గ్రామ శివారులోని చౌటుప్పల్ రహదారిలోని కార్తీకేయ కాటన్ మిల్లు వెనుక భాగం 333, 334 సర్వే నెంబర్ సమీపంలో సూమారు 5నుంచి 6ఎకరాల వరకు వాగును కబ్జా చేసుకొని వరిపంట సాగు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వాగులో పెద్ద పెద్ద కట్టలు అడ్డంగా చెక్ డ్యాంలుగా మట్టి పోసి పొలం ఏర్పాటు చేసుకొని వరి సాగు చేస్తుండడంతో వర్షాలు వచ్చినప్పుడు పై నుంచి వచ్చే నీటి వరదకు చుట్టు పక్కల పొలాలు మునిగి పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. ఇట్టి విషయంపై మునుగోడు మండల ఇంచార్జి తహశీల్ధార్ నరేష్ ను వివరణ కోరగా ప్రభుత్వ భూములను, వాగులను ఎవ్వరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, భూమి ఆక్రమణపై దృష్ఠి సారించామన్నారు. వెంటనే ఆక్రమిత భూములపై ఉన్నతాధికారుల దృష్ఠికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకుంటామన్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి మునుగోడు ప్రధాన వాగు పరివాహక ప్రాంతమైన కార్తికేయ కాటన్ మిల్లు దగ్గర వెనకాల ఆనుకొని ఉన్న వాగును మునుగోడు మండల పరిధిలోని ఓ ప్రజా ప్రతినిధి అధికారుల అండదండలతో నాకు సాటి ఎవరూ లేరని తన ఇష్టారాజ్యంగా మా పూర్వీకుల పేరు మీద సర్వే నెంబర్ 333, 334 లో భూమి ఉన్నదంటూ వాగుని మలుపుకొని సేద్యం చేస్తూ ఇతర రైతులకు ఆటంకం కలిగిస్తుండు. నేను ఆక్రమించుకున్నదంతా నాదేనని రాజకీయ పలుకుబడితో ప్రవహిస్తున్న వాగును సైతం జెసిబిలతో సుమారు 10 ఫీట్ల లోతులో తవ్వి కట్టడాలు పోస్తున్న విషయాన్ని గమనించిన చుట్టుప్రక్కల రైతులు కబ్జా చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించగా అతను మీరు ఎవరికీ చెప్పుకుంటారో ? చెప్పుకోండి నాకు ఏమి భయం లేదు! అని దౌర్జన్యంగా వారిపై దూషణలు చేస్తూన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాగే వాగు కబ్జాకు గురైతే భవిష్యత్తులో వర్షపు నీరు పోవడానికి వీల్లేకుండా పోయె ప్రమాదంతో పాటు రైతుల పంట పొలాలపై భూ కోతలు జరిగేటట్లు ఉందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ అధికారులు అక్రమ భూ కబ్జాదారులపై చర్యలు తీసుకొని వాగు పరివాహ ప్రాంతానికి హద్దురాలను నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking