*జహీర్ అలీ ఖాన్ మృతి పట్ల సంతాపం*
*- ఐజేయూ, టీయూడబ్ల్యూజే*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
పౌరహక్కుల పరిరక్షణోద్యమ నాయకులు, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు, గొప్ప ప్రజాస్వామికవాది, సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ ఆకస్మిక మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జహీర్ అలీ ఖాన్ తో తమ సంఘానికి మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉందని వారు గుర్తుచేశారు. ప్రగతిశీల భావజాలంతో సామాజిక ఉద్యమంలో జహీర్ అలీ ఖాన్ పోషించిన పాత్ర అభినందనీయమన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన మడమతిప్పకుండా పోరాడిన ఉద్యమకారుడని వారన్నారు. అలాగే సియాసత్ ట్రస్ట్ ద్వారా ఎన్నో పేద ముస్లిం కుటుంబాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఆపద్బాంధవుడిలా నిలిచారని ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు కొనియాడారు. ఈ సందర్బంగా జహీర్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.