జర్నలిస్టుల ఆ కోరికలు* *న్యాయమైనవే* *-అసెంబ్లీ స్పీకర్ పోచారం*

*జర్నలిస్టుల ఆ కోరికలు* *న్యాయమైనవే*
*-అసెంబ్లీ స్పీకర్ పోచారం*

కామారెడ్డి, అక్షిత ప్రతినిధి :
దారిద్యరేఖ దిగువ కేటగిరికిలోకి వచ్చే జర్నలిస్టులు, తమకు ఆరోగ్య భద్రతా, పిల్లలకు ఉచిత విద్య, ఇళ్ల స్థలాలను అందించాలని కోరడం న్యాయబద్దమేనని, వీటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర శాసన సభాధిపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆదివారం నాడు జిల్లా కేంద్రమైన కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కామారెడ్డి జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

తన నియోజకవర్గ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు, ఇండ్లు అందించి 53 కుటుంబాలకు గూడు కల్పించడం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని స్పీకర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాల కోసం కృషి చేస్తానన్నారు. దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఎందరో మాట తప్పిన ముఖ్యమంత్రులను చూశానని, కానీ ప్రస్తుత సీఎం కేసీఆర్ వారికి భిన్నంగా ఉన్నారని, ఆయన నోటా మాట వచ్చిందంటే అది జీవో రూపం దాల్చడం ఖాయమని స్పీకర్ పోచారం కొనియడారు. ప్రజలకు హామీ ఇస్తే ఎన్ని కోట్లయినా ఖర్చు బెట్టడానికి వెనకాడరని ఆయన అన్నారు. జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
జుక్కల్ ఎమ్యెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ, దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాల వలే, ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్న పాత్రికేయుల కోసం జర్నలిస్టు బంధు పథకం కోసం తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పోషించిన పాత్ర, వారి త్యాగాలు మరచిపోలేనివని షిండే అన్నారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ మాట్లాడుతూ, రాజీలేని పోరాటాలు, త్యాగాలు, విజయాల కలయికే తమ సంఘమని చెప్పారు. 65ఏండ్ల సుదీర్ఘ పోరాటాల చరిత్ర దేశంలో కేవలం తమ సంఘానికి మాత్రమే ఉందన్నారు. నాటి నుండి నేటి వరకు వేలాది జర్నలిస్టుల ఆదరాభిమానాలు, విశ్వాసం చురగొంటున్న ఏకైక సంఘం తమదేనన్నారు. జర్నలిస్టు సంఘాల పేరుతో నిన్న మొన్న ఏర్పాటైన దుకాణాలు తాత్కాలికమేనని, రాష్ట్రంలో జర్నలిస్టుల ఆదరణ వారికి ఏమాత్రం లేదన్నారు. ఇంకా ఈ సభలో జిల్లా అధ్యక్షులు లతీఫ్, హెచ్.యు.జె అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రజనీకాంత్, జాతీయ కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*నూతన అధ్యక్ష,* *కార్యదర్శులుగా*
*రజనీకాంత్, వెంకట రమణ*
——————————
ఆదివారం నాడు టీయూడబ్ల్యూజే కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా రజనీకాంత్ (ఐ న్యూస్ ప్రతినిధి)
వెంకట్ రమణ(ఆంధ్రజ్యోతి)లు ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హెచ్.యు.జె అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్ వ్యవహరించారు. నూతన కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking