అన్ని హంగులు .. అత్యాధునిక టెక్నాలజీ 

అన్ని హంగులు .. అత్యాధునిక టెక్నాలజీ 

20 ఎకరాలు.. 38.50కోట్లతో 60వేల చదరపు అడుగులలో

సకల హంగులతో సిద్ధమైన జిల్లా పోలీస్‌ కార్యాలయ భవనం

20న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, పబ్లిక్‌ గ్రీవెన్స్‌హాల్‌

కార్పొరేట్‌ సంస్థల తరహాలో రిసెప్షన్‌ సెంటర్లు

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి :

రాజ భవనంలా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ సూర్యాపేట జిల్లాలో నిర్మితమైన నూతన పోలీస్ కార్యాలయం. పోలీసు కార్యాలయాలు ప్రజాసేవకు వేదికలుగా మారాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ లో అత్యాధునిక హంగులతో నిర్మించిన సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం,ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. పోలీస్‌ సేవలు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను, సౌకర్యాన్ని జోడించి నిర్మించిన ఈ భవనాలను 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కొత్త హంగులతో గాలి, వెలుతురు,సూర్యరశ్మి వచ్చేలా విశాలమైన గదులతో అందరినీ ఆకట్టుకునేలా జిల్లా పోలీసు కార్యాలయం రూపు దిద్దుకుంది.

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం సూర్యాపేట జిల్లాకు పోలీసు కార్యాలయ భవనాన్ని మంజూరు చేసింది. పట్టణం లోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో 20 ఎకరాల స్థలాన్ని పోలీసు కార్యాలయ భవనానికి మంజూరు చేసింది. పోలీస్ ఆఫీసు బిల్డింగ్ తోపాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నివాస గృహాలు ఒకే ప్రాంగణంలో కొలువు దీరనున్నాయి. ల్యాండ్‌స్కేప్, పార్కింగ్, అంతర్గత రహదారుల తో కూడిన ప్రధాన భవన నిర్మాణం అందులోని గదులు తుది మెరుగుల దశలో ఉన్నాయి.కార్పొరేట్ భవనాన్ని తలపించేలా అన్ని వసతులతో నిర్మించారు. సూర్యాపేట లో నిర్మించే భవనానికి మిగతా చోట్ల కంటే ఎక్కువగా స్థలం ఉండడంతో రాష్ట్రంలో ఇదే అతి పెద్ద కార్యాలయమని దీని నిర్మాణ బాధ్యతలు చూస్తున్న పోలీస్ హౌసింగ్ బోర్డు అధికారులు చెబుతున్నారు.ఎలాంటి విపత్తులు ఎదురైనా తట్టుకునేలా ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉన్న ఈ భవన సముదాయంలో వసతులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం 16 విభాగాలుంటాయి. ఎస్పీ, ఏఎస్పీ గదులతో పాటు వారి ఓఎస్డీలు, సీసీలు, పీఆర్వో లకు వేరువేరుగా గదులు ఉంటాయి. స్టోర్స్, ఇన్ వార్డ్, అవుట్ వార్డులతో పాటు పాస్పోర్టు విచారణ, ఐటీసీ విభాగాలు ఉన్నాయి. రిసెప్షన్ తో పాటు గ్రీవెన్స్ కోసం ప్రత్యేకంగా హాలు ఉంది. మొదటి అంతస్తులో పరిపాలన విభాగంలోని ఆయా సెక్షన్ల సూపరిండెంట్లు, వారికి ప్రత్యేకంగా రికార్డ్ గదులు, మినీ కాన్ఫరెన్స్ హాల్,న్యాయ సేవ విభాగం ఇలా అన్ని కలిసి మొత్తం 21 గదులున్నాయి. మొత్తానికి సకల సౌకర్యాలతో భవనం రెడీ కావడంతో జిల్లా పోలీసులకు స్మార్ట్ పోలీసింగ్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నేరాల అదుపులో ముందున్న తెలంగాణ పోలీస్ నూతన కార్యాలయాలు రావడంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేయనున్నారు.ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్‌ కార్యాలయాలు చాలాచోట్ల నిజాం కాలంనాటి భవనాల్లో, శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఉండేవి. తెలంగాణ ఏర్పడ్డాక పోలీస్‌శాఖకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి శాశ్వత ప్రాతిపదికన భవనాన్ని నిర్మించింది. రూ.38.50 కోట్ల తో 20 ఎకరాల్లో జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని నిర్మించారు. నూతన భవనాలను ప్రజావసరాలకు అనుగుణంగా పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ తీర్చిదిద్దింది. దూరదృష్టితోనే భవన నిర్మాణాలు శాంతిభద్రతలు సరిగా ఉంటేనే రాష్ర్టానికి పెట్టుబడులు వస్తాయన్న దూరదృష్టి కలిగిన నేత సీఎం కేసీఆర్‌ పోలీసు కార్యాలయాల భవన నిర్మాణాలను శ్రీకారం చుట్టారు.

*ఇవీ ప్రత్యేకతలు* ..

సూర్యాపేట డిపిఓ (జిల్లా పోలీసు కార్యాలయం)భవనం మూడు అంతస్థుల్లో 60 వేలచదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. దీనిలో, ఎస్పీల కార్యాలయాలతోపాటు డీఎస్పీ చాంబర్లు, కాన్ఫరెన్స్‌ హాల్‌, స్పెషల్‌బ్రాంచ్‌, పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ సెల్‌.. మొదటి అంతస్థులో అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలు, రెండో అంతస్థులో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ఎలక్ట్రికల్‌ ప్యానెల్‌రూం, ఐటీ కోర్‌టీం, క్లూస్‌టీం, విశాలమైన పార్కింగ్‌ సదుపాయలు కల్పించారు. ఫిర్యాదులు, ఇతర పనులపై వచ్చే సామాన్యప్రజలతో ఎస్పీ, కమిషనర్‌ నేరుగా మాట్లాడేలా రూపొందించిన పబ్లిక్‌ గ్రీవెన్స్‌హాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా సూర్యాపేట జిల్లా లో ఉన్న అన్ని ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను ఇక్కడి నుంచి చూడవచ్చు. పరేడ్‌ గ్రౌండ్‌, ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌, బ్యారక్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఎమినిటీస్‌ బ్లాక్‌, డాగ్‌ కెన్నెల్స్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బంది నివాస గృహ సదుపాయాలు సమకూర్చనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking