*ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కోవాలి*
పోలింగ్ ప్రక్రియ, ప్రత్యేక సదుపాయాలపై వయోవృద్దులకు అవగాహన*
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్*
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
వయోవృద్ధులు ప్రతిఒక్కరూ ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణ న్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉద యాదిత్య భవన్ లో మంగళవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్దులకు పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరు గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తూ, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వి.వి.ప్యాట్ ల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఎంతో ప్రాముఖ్యత, విలువ ఉందని, ధనికులకు, పేదలకు ఓటు హక్కు అందరికీ సమానమే అని తెలిపారు.ఎన్నికల లో కీలకమైన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని ఆయన హితవు పలికారు.జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్ లలో సోమవారం ముసాయిదా ఓటర్ జాబితా ప్రచు రించినట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితా లో తమ పేరు ఉందా చెక్ చేసుకోవాలని లేకుంటే ఓటర్ గా నమోదు చేసుకోవాలని అన్నారు.వయో వృద్దులు తమ పిల్లలను చూడటానికి వేరే పట్టణం లకు వెళుతుంటారు అని,ఎన్నికల్లో ఓటర్ గా ఓటర్ జాబితా లో పేరు ఉంటేనే ఓటు వేయ వచ్చని అన్నారు. జిల్లాలో ఎంతో చైతన్యం కలిగిఉన్న వయోవృద్ధులు ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. ఓటర్ల సౌకర్యార్ధం ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేపడుతూ, వివిధ రకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తోందని కలెక్టర్ గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ఎనభై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులు, దివ్యంగులు తమ ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించిందని వివరించారు. ఇంటి నుండి ఓటు వేయదల్చుకున్న వారు ఎన్నికల ప్రకటన వెలువడిన మీదట నిర్ణీత ఫారం 12 ‘డి’ నింపి తమ అభ్యర్థనను తెలియజేస్తే, పోలింగ్ అధికారి నేతృత్వంలోని సిబ్బంది వారి ఇంటి వద్దకు వచ్చి సీక్రెట్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సదుపాయాన్ని 80 సం.లు దాటిన వయో వృద్దులు, కదల లేని వారు, ఓటర్ లు, డాక్టర్ చే గుర్తించిన వ్యాధి గ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వయోవృద్దుల కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంప్, వీల్ చెయిర్ వంటి సదుపాయాలూ అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు.ఓటు వేయడానికి ఇంటి నుండి పోలింగ్ కేంద్రంకు,తిరిగి వెళ్ళడానికి వాహనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేస్తూ, పూర్తి అవగాహన కల్పించేందుకు వీలుగా కలెక్టరేట్, ఇతర కార్యాలయాల్లో నమూనా కేంద్రాలను నెలకొల్పడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్ సి. ఈ. ఓ,స్వీప్ నోడల్ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ ఓటు బ్రహ్మస్త్రం అని,ఓటు ద్వారా ప్రజలకు సేవ చేసే మంచి వారిని అవకాశం వుంటుందని అన్నారు.ఓటు అమ్ముకోకుండా సక్రమంగా వినియోగించుకొని ప్రజాస్వామ్య పటిష్టతకు పాటు పడాలని అన్నారు.ఈ సందర్భంగా పలువురు సీనియర్ సిటిజన్స్ ను శాలువాతో జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా,శిశు,వయో వృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణ వేణి,జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి,తహశీల్దార్ శ్రీనివాస్,నల్గొండ నియోజకవర్గ స్వీప్ నోడల్ అధికారి లక్ష్మి నారాయణ, సీనియర్ సిటిజన్ ఫోరమ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.