ఓటరు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలి

ఓటరు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలి

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ఎస్. ఎస్. ఆర్. 2023 లో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.

సోమవారం హైదరాబాదు నుండి సంయుక్త ఎన్నికల అధికారులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు అందిన దరఖాస్తుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమం భాగంగా నూతన ఓటరు నమోదు, జాబితాలో సవరణల కొరకు అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 18, 19 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, లింగ నిష్పత్తి వారీగా దరఖాస్తు ఫారాలను పరిశీలించి ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, నూతన ఓటర్ నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించడంతో పాటు ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్, దివ్యంగులతో తరచుగా సమావేశాలు నిర్వహించి ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో సవరణలపై ప్రజలను చైతన్యపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్ధులను ఓటరు జాబితాలో ప్రత్యేక మార్కింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. జనాభా, లింగ నిష్పత్తి ప్రకారంగా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కళాశాలలలో 18, 19 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఓటరు జాబితాలో చేర్చే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్డీవోలు రవి, శ్రీరాములు, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking