విశ్వనగరంగా హైదరాబాద్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
హైదరాబాద్ నగరం ఓ మినీ ఇండియా అని సీఎం అభివర్ణించారు. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో కలసిమెలసి బతుకుతున్నారన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశామని, గతంలోలా మత కల్లోలాలు, గొడవలు లేకుండా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉందని చెప్పారు. పారదర్శక పరిపాలన, నిరంతర విద్యుత్తు వంటి కారణాలతో అనేక అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు 67 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను చేపట్టి, పూర్తిచేస్తున్నామని చెప్పారు. నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇప్పటికే 20 ఫ్లైఓవర్లు పూర్తిచేసి ప్రారంభించుకున్నామని, అంతర్జాతీయస్థాయిలో ఇప్పటిదాకా 36 పనులు పూర్తి చేశామని తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ నదీ తీరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయని సీఎం చెప్పారు. హైదరాబాద్ నగరం నలువైపులా 69 వేలకోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీంతో హైదరాబాద్ లో మొత్తం 415 కిలోమీటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నదని, విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందనున్నదని అన్నారు.