అన్నింటా నంబర్ 1 తెలంగాణ

అన్నింటా నంబర్ 1 తెలంగాణ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

నేడు తెలంగాణ అనేక రంగాలలో నంబర్ వన్ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. అనతి కాలంలోనే విద్యుత్ రంగ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకూ 24 గంటల పాటు వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. తలసరి ఆదాయంలో కూడా 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని చెప్పారు. ఇవాళ మిషన్ భగీరథతో నూటికి నూరుశాతం ఇండ్లకూ ఉచితంగా నల్లాలు బిగించి, స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా దేశంలో తెలంగాణ మాత్రమేని తెలిపారు. దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్దపెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్న వయసు ఉన్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకు దూసుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్ మార్మోగుతున్నదని, తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని అన్నారు. మన సమైక్యతే మనకు బలమని, ఈ జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దామని, తెలంగాణ ప్రగతిని ఇదేవిధంగా కొనసాగిద్దామని సీఎం పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking