వైద్య వృత్తి పవిత్రమైనది
* మిర్యాలగూడలో ఈఎన్టీ వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సు
తెలంగాణలో వైద్య విప్లవం
ఎoఎల్ఏ నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సు మిర్యాలగూడ పట్టణంలోని ఎస్పీ కన్వెన్షన్ హాల్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత దేశ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను సృష్టిస్తున్నదని అన్నారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకున్నదని అన్నారు.
దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వైద్యాన్ని చేరువచేసే దిశగా ప్రతి జిల్లాకొక మెడికల్ కాలేజీ అనే లక్ష్యానికి చేరువలోకి తెలంగాణ రాష్ట్రం చేరుకున్నదన్నారు. ఎందుకంటే తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదు అని రాష్ట్రం ఏర్పడే ముందు ఎకసెక్కాలు పలికిన సందర్భాలు మనం అందరం కూడా చూసినాం. ప్రత్యక్ష సాక్షులుగా కూడా ఉన్నాం . అటువంటి తెలంగాణలో ఈరోజు ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ అనే లక్ష్యంలో భాగంగా 26 మెడికల్ కాలేజీలకు చేరుకున్నాం. గతంలో కేవలం 5 ఉంటే ప్రస్తుతం 26కు చేరుకున్నామని అన్నారు. రాబోయే విద్యాసంవత్సరంలో మరో 8 వైద్య కాలేజీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్నదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మొత్తం 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేటట్లుగా రాష్ట్ర క్యాబినెట్ అమోదించింది, పాలసీ ఐపోయిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. 2014 లో 2,850 వైద్య సీట్లు (ఎంబీబీఎస్) మాత్రమే తెలంగాణలో ఉండేవని, ప్రస్తుతం 8,515 మెడికల్ సీట్లు తెలంగాణలో ఉన్నాయని అన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధక శక్తి కలిగి ఉండాలంటే తెల్ల రక్తకణాలు రక్తంలో ఏ విధంగా పనిచేస్తాయో అదే విధంగా తెలంగాణ ఉత్పత్తి చేసే తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థకు అదే పద్దతిలో పనిచేస్తారు. ఇది నిర్వివాదాంశం ఎవరికీ సందేహం అవసరం లేదని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ ఇబ్బందులను గుణపాఠంగా తీసుకుని మెడికల్ ఇన్ ఫ్రాస్టక్చర్ ను బలోపేతం చేస్తూ వైద్యరంగంలో మౌలిక వసతులను గుణాత్మకంగా అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు.500 టన్నుల ఆక్సీజన్ ను కూడా తెలంగాణలో తయారు చేసుకుంటూ ఆ దిశగా స్వయం సమృద్ధి సాధిస్తున్నామని అన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు మొత్తం 50 వేల పడకలను ఆక్సీజన్ బెడ్స్ గా తయారు చేసుకుంటున్నామని అన్నారు. 10వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులో ఉండేటట్టు ఉండేట్లు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో వైద్యారోగ్యం రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందుకుంటోందని అన్నారు.నీతి అయోగ్ నివేదిక ప్రకారం 2014 లో 11వ స్థానం లో ఉన్న తెలంగాణ ప్రస్తుతం 3వ స్థానంలోకి చేరుకున్నదని అన్నారు.ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరుగుతున్నాయని అన్నారు. ఇది ప్రజల్లో ప్రభుత్వ వైద్యం పట్ల పెరిగిన విశ్వాసానికి తార్కాణమని అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కృషి వల్ల 2014 లో 92 మంది మాతా మరణాలు ఉంటే దానిని 43 కి తగ్గించుకోగలిగామన్నారు. శిశు మరణాల సంఖ్య 39 గా ఉండేవి. ప్రస్తుతం 21కి తగ్గించగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, అమ్మఒడి వాహన సౌకర్యంతో ప్రసవాల రేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిందన్నారు. 2014లో 30 శాతం ఉన్న ప్రసవాల సంఖ్య 2023 నాటికి 76 శాతానికి పెరిగిందని భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైద్యులు శేఖర్ రెడ్డి, రాకేశ్, నాగార్జున రెడ్డి, వంశీ, వైద్య విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.